June 7, 2013

లోకేష్‌ కాలేజీ బాట

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌బాబు త్వరలోనే రాష్ర్ట వ్యాప్తా పర్యటనకు సిద్ధమవుతున్నారు. జూన్‌ నెలఖారులో కానీ జులై మొదటి వారంలో ఆయన రాష్ట్ర వ్యాప్తా పర్యటన చేపట్టే అవకాశాలున్నట్లు లోకేష్‌ సన్నిహితులు వెల్లడించారు. జులై మొదటి వారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరు జిల్లాలలో బస్సు పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో లోకేష్‌ తన రాష్ట్ర వ్యాప్తా పర్యటనను వినూత్నంగా చేపట్టాలని యోచిస్తున్నారన్నారు. పార్టీకి యువ రక్తాన్ని ఎక్కించాలని ఆయన భావిస్తున్నారన్నారు. అందుకే రాష్ర్ట వ్యాప్తాంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీకేంద్రాల బాట పట్టాలని యోచిస్తున్నారన్నారు.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ కేంద్రాలతో పాటు మారుమూల ప్రాంతంలోని కాలేజీలలో కలియ తిరుగుతూ విద్యార్థి, యువతను కలుసుకుని పార్టీ వైపు ఆకర్షించాలని లోకేష్‌ నిర్ణయించారని వెల్లడించారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీడీపీ మద్దతునివ్వాలని ఆయన విద్యార్థులను కోరనున్నారన్నారు. అదోగతి పాలైన రాష్ట్రం తిరిగి అభివృద్ధిపథంలో పయానించాలంటే, నిరుద్యోగ యువతీ, యువకులకు తిరిగి ఉద్యోగ, ఉపాధివకాశాలు లభించాలంటే టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం అనివార్యమని లోకేష్‌ వివరించనున్నారని పేర్కొన్నారు.

గతంలో టీడీపీ హయాంలో చదువుకున్న యువతీ, యువకులకు మల్టీనేషన్‌ కంపెనీలు పిలిచి ఉద్యోగావకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేయనున్నారన్నారు. బెంగళూర్‌కు ధీటుగా హైదరాబాద్‌ను ఐటీ రంగంలో అభివృద్ధి చేయడంలో టీడీపీ కీలకపాత్ర పోషించిన వైనాన్ని విద్యార్థి, యువతకు వివరించి ఆకట్టుకునే ప్రయత్నం లోకేష్‌ చేయనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సామాజిక వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుని యువతతో తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్న లోకేష్‌ ఇకపై నేరుగా వారి మధ్యకు వెళ్లాలని నిర్ణయించుకోవడం వల్ల పార్టీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పార్టీ పట్ల వారి ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకుని అవకాశం లభిస్తుందంటున్నారు.