June 21, 2013

ఇంత అసమర్థ స్పీకర్‌ను చూడలేదు

శాసనసభను నిర్వహించడంలో సభాపతి నాదెండ్ల మనోహర్‌ తీవ్ర వైఫల్యం చెందారని టీడీపీ సీనియర్‌ శాసనసభ్యుడు మోత్కుపల్లి విమర్శించారు. స్పీకర్‌ అసమర్ధుడు, చేతగాని చేవలేని వాడు.. చచ్చు వెధవ అంటూ మోత్కుపల్లి తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ కండువాను వేసుకుని ఆధికార పార్టీకి కొమ్ముకాసేలా సభాపతి వ్యవహరించారని ధ్వజమెత్తారు. తాము ఎంతో మందిని చూశామని, మరీ ఇంత అసమర్ధుణ్ణి ఇప్పుడే చూస్తున్నామని మోత్కుపల్లి మండిపడ్డారు. శాసనసభ విలువలు గౌరవాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఇలాగేనా వ్యహరించాల్సింది? ప్రతిపక్షాల పట్ల ఇంత నిర్లక్ష్యమా? సభాపతికి తాము లేఖ రాసినా ఆయన స్పందించక పోతే తాము ఇక ఎవరికి చెప్పుకోవాలి? అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను సభాపతి నిరవధికంగా వాయిదా వేసుకువెళ్లారని, ప్రజా సమస్యలను తాము చర్చకు ఎక్కడ పెట్టాలని మోత్కుపల్లి నిలదీశారు.

ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు
రాష్ర్త బడ్జెట్‌ రూ.లక్షా 62 వేల కోట్లతో రూపొందించారని అదంతా ప్రజల సొమ్ము అని అలాంటి ఖర్చుపై ప్రభుత్వం జవాబుదారీతనం లేకుండా వ్యవహరించి ందని జేపీ మండిపడ్డారు. సంఖ్యాబలం ఉంది కదా అని తమకు తామే బిల్లు పాస్‌ చేసుకొని వెళ్లి పోవడం ఏ మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఒక కుటుంబాని కొచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చుచేయాలో కుటుంబ సభ్యులంతా చర్చిస్తారని అలాంటిది ఎనిమిది కోట్ల మందికి సంబంధించిన బడ్జెట్‌ ఖర్చుపై చర్చ లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.