June 21, 2013

కేటీఆర్ కోసం తెలంగాణ వాదాన్ని పక్కనపెట్టిన టీఆర్ఎస్:మోత్కుపల్లి

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీలో ఎందుకు రాద్దాంతం చేయడం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. సభ ప్రారంభం కాగానే తెలంగాణ కోసం పట్టుపట్టి తర్వాత పట్టువీడి మౌనంగా కూర్చున్నారని ఆయన విమర్శించారు. దమ్మున్న చానల్ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే. తారక రామారావు సెటిల్‌మెంట్ దందాపై కథనం రావడంతో టీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ సాధన లక్ష్యంగా కాకుండా కెటిఆర్‌ను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణపై తీర్మానం అంటూ నిన్నటి వరకు రాద్దాంతం చేసి.. ఇప్పుడు ఎందుకు మౌనంగా కూర్చున్నారని మోత్కుపల్లి ప్రశ్నించారు. కెటిఆర్ కోసం తెలంగాణవాదాన్ని పక్కన పెట్టారన్నారు. సభను ఇప్పుడు అడ్డుకోకపోవడం వెనుక కారణమదేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దొంగల్లా కూర్చున్నారన్నారు.

కెసిఆర్ కుటుంబం మరో నిజాంను తలపిస్తోందన్నారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు మరోసారి బయటపడిందన్నారు. ఆంధ్రజ్యోతి కథనం సెగ తగలడం వల్లే మౌనంగా కూర్చున్నారన్నారు. ఉదయం అంతా గొడవ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తీర్మానంపై మాట్లాడటం లేదన్నారు. చరిత్రలో ఏ ఉద్యమకారుడు అయినా ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకున్నారని, కెసిఆర్ మాత్రం ఉద్యమం పేరుతో కోట్లు దండుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఉద్యమం పేరుతో డబ్బులు దండుకున్న చరిత్ర కెసిఆర్‌కే దక్కిందన్నారు. కెసిఆర్ తన ఆస్తులపై సిబిఐ విచారణ కోసం లేఖ రాయాలన్నారు.