June 25, 2013

కాంగ్రెస్‌ది విదేశీ గబ్బు: టిడిపి

కాంగ్రెస్ పార్టీలో స్వదేశీ వాసనలు పోయి విదేశీ గబ్బు కొడుతోందని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు, టిడిపి నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. టిడిపి, వైఎఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు అని ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దీనిపై యనమల స్పందిస్తూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన టిడిపి ముఖ్యమంత్రికి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా కనిపించడం విడ్డూరమని అన్నారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తి నేతృత్వంలో పని చేసే కాంగ్రెస్ పార్టీ మల్టీ నేషనల్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌గా తయారైందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇటలీకి చెందిన వారని, ఉపాధ్యక్షుడు రాహుల్ జీన్స్ కూడా అక్కడివేనని అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ , ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బొమ్మలతో వారసత్వ రాజకీయాల పార్టీ కాంగ్రెస్‌లో పని చేస్తూ టిడిపిపై రాళ్లు విసిరితే అవి వాళ్ల నెత్తినే పడతాయని అన్నారు. కుర్చీ నిలబెట్టుకోవడానికి ఢిల్లీ చుట్టూ 80 సార్లు ప్రదక్షిణలు చేసిన ముఖ్యమంత్రి వరద బాధితులను పరామర్శించేందుకు ఒక్కసారి ఢిల్లీ వెళ్లే తీరిక లేదా? అని యనమల ప్రశ్నించారు. వరద బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు టిఎన్‌ఎస్‌వి ఉపాధ్యక్షుడు నరసింహారావు లక్ష రూపాయల విరాళం ఇచ్చినట్టు టిడిపి ప్రకటనలో తెలిపింది.