June 25, 2013

రాజకీయంపై బాబు స్పందన!

ఉత్తరాఖండ్ వరదలను రాజకీయం చేస్తున్నారన్న కాంగ్రెసు నేతల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. తాను రాజకీయాలు చేయడం లేదని, ఓ మనిషిగా సహాయం చేసేందుకు వచ్చానని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని రాజకీయం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. వరద బాధితుల ఇబ్బందులను చూసి చలించిపోయానన్నారు. పలువురు యాత్రికులను ప్రత్యేక విమానంలో స్వస్థలాలకు పంపినట్లు చెప్పారు. తాను సాయం చేసేందుకే వచ్చానని, రాజకీయం చేసేందుకు రాలేదన్నారు.

ఎపి భవన్ అధికారుల తీరుపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్యుల వైద్య శిబిరాన్ని అధికారులు తొలగించడమేమిటని ప్రశ్నించారు. వరద బాధితులకు వైద్యం అందకుండా అధికారులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఎపి భవన్ అధికారుల వ్యవహార శైలిపై మంత్రి శ్రీధర్ బాబు విస్మయం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సహాయం నిరాకరించడంపై టిడిపి నేతలు శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేశారు.

తెలుగు వారికి సౌకర్యాలు కల్పించని ఎపి భవన్ అధికారి శశాంక్ గోయల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని టిడిపి నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ చేతకానితనానికి ఇది నిదర్శనమన్నారు. ఎపి భవన్‌లో ఉన్న 1500మందిలో వంద మందికే రవాణా ఖర్చులు చెల్లించడమేమిటని ప్రశ్నించారు.