June 25, 2013

కాంగ్రెస్ నేతల్ని ఉరి తీయాలనిపిస్తోంది : టీడీపీ నేతలు

చార్‌ధామ్ బాధితుల కన్నీటి గాథలు వింటుంటే.. వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకులను ఉరితీయాలనిపిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కేశినేని ట్రావెల్స్‌లో విజయవాడకు చేరుకున్న 45 మంది యాత్రికులకు మంగళవారం ఉదయం స్వాగతం పలికారు. వారిని పరామర్శించిన రాజేంద్రప్రసాద్.. వారు తాము పడ్డ కష్టాల గురించి చెబుతుంటే కాంగ్రెస్ నాయకులను ఉరితీయాలనిపిస్తోందన్నారు. ఢిల్లీలో తెలుగు యాత్రికులు చాలా అవమానాలకు గురయ్యారని ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో టీడీపీ ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని తొలగించడం హేయమైన చర్య అని పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజమెత్తారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. యాత్రికుల విషయంలో ప్రభుత్వం ఇంతవరకూ సరైన రీతిలో స్పందించకపోవడం శోచనీయమని ఆదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోడ్ విమర్శించారు.

కాగా.. "చార్‌ధామ్ బాధితుల కోసం ఏపీ భవన్‌లో మేం నెలకొల్పిన వైద్య శిబిరాన్ని తొలగించాలన్న నిర్ణయం ఎవరిది? అది శశాంక్ గోయల్‌ది అయితే ఆయన్ను సస్పెండ్ చేయాలి. సీఎం కిరణ్ ఆదేశాలతో ఆయన చేస్తే.. సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలి'' అని టీడీపీ పార్టీ ఉపాధ్యక్షుడు ఎల్‌వీఎస్ఆర్‌కే ప్రసాద్ డిమాండ్ చేశారు. "సేవచేయడంలో మాతో పోటీ పడండి. అది వదిలిపెట్టి మాపై ఈర్ష్య పడటం ఎందుకు?'' అని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకుంటున్న బాబును అభినందించాల్సిందిపోయి.. కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని సీనియర్ నేత యనమల అన్నారు.
చంద్రబాబూ.. శవరాజకీయాలు మానుకో: సారయ్య
టీడీపీ అధినేత చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఉత్తరాఖండ్ విషాదానికి దేశమంతా శోకసంద్రంలో మునిగిపోతే చంద్రబాబు మాత్రం రాజకీయం చేస్తున్నారన్నారు.