June 9, 2013

కేసీఆర్‌ తొత్తు కోదండరాం

రెండు దశాబ్దాలుగా ఏంచేశావ్‌
తెరాస పార్టీకి కన్వీనర్‌లా
వ్యవహరిస్తున్నావ్‌
తెలుగుదేశం పార్టీ తెలంగాణకు
వ్యతిరేకం కానేకాదు: ఎర్రబెల్లి
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుకు తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరాం తొత్తుగా మారి, ఆయన చెప్పిందే వేదంగా నడుచుకుంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు తీవ్ర ఆరోపణ చేశారు. ఆదివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి కాంగ్రెస్‌, టీడీపీ, వైకాపాకు చెందిన తెలంగాణ నేతలను పిలవమని కోదండరాం చెప్పారని, తమను పిలువనప్పుడు తమ గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. కోదండరాం జేఏసీ కన్వీనర్‌గా కాకుండా తెరాస కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తమ నిర్ధిష్ట విధానాన్ని ప్రకటించలేదని, కాంగ్రెస్‌ అధినాయకత్వంపై ఒత్తిడి తేలేకపోయిందని, అయితే టీడీపీ మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్త పరుస్తూ లేఖ రాసిందని, మహానాడులో తీర్మానం కూడా ప్రవేశపెట్టామని తెలంగాణ కోసం తమ పార్టీ పక్షాన చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న కేసీఆర్‌తో కోదండరాం ఎందుకు అంటకాగుతున్నారని విమర్శించారు. ఈయన చర్యలవల్ల గద్దర్‌, విమల, కృష్ణమాదిగ లాంటి వారు జెెఏసీ నుండి వైదొలిగారని తెలిపారు. బిజేపి కూడా విధిలేని స్థితిలో జెెఏసీతో కలిసి ఉందన్నారు. కేసీఆర్‌ కొమ్ముకాసే విధానాన్ని కోదండరాం మానుకోవాలని హితవుపలికారు.