June 9, 2013

టీడీపీ ‘టార్గెట్ మంత్రులు’! ఆరోపణలున్న వారి బర్తరఫ్ కోసం పట్టు


అసెంబ్లీలో పట్టుబడతామని నేతల ప్రకటన ఎమ్మెల్యేల భేటీలో చంద్రబాబు సమీక్ష
ఆరోపణలున్న మంత్రులందరి బర్తరఫ్ కోసం సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ మలి విడత బడ్జెట్ సమావేశాలలో పట్టుబడతామని టీడీపీ ప్రకటించింది. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ శాసనసభాపక్ష ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పారు. జీవోల అంశంలో సుప్రీంకోర్టు కేసులో ఉన్న ముగ్గురు మంత్రులతో పాటు శైలజానాథ్, రఘువీరారెడ్డి, పార్థసారథి, శ్రీధర్‌బాబుల బర్తరఫ్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే విత్తనాలు, కరెంట్ కోతల వంటి సమస్యలపై 11 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి జవాబు కోరతామన్నారు.

అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం మోత్కుపల్లి, కేశవ్ ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సభ సజావుగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రితో పాటు శాసనసభా వ్యవహారాల మంత్రి, సభాపతిని కోరుతున్నట్టు చెప్పారు. ఏపీపీఎస్సీ బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయని, అక్రమార్కులకు సీఎం అండగా ఉంటున్నారని ఆరోపించారు. సభ రెండో రోజు బయ్యారం గనుల అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వాలని, కరెంట్ సమస్యపై పార్టీ సేకరించిన సంతకాల వివరాలను మూడవ రోజు సభలోనే ప్రభుత్వానికి సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు.

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యేల అరెస్టు

ఏపీపీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, సభ్యులను తొలగించి బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద బైఠాయించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. ఎర్రబెల్లి దయాకరరావు, పయ్యావుల కేశవ్, మోత్కుపల్లి నర్సింహులు, పరిటాల సునీత అసెంబ్లీలోని టీడీఎల్పీ నుంచి ర్యాలీగా క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు సిద్ధపడగానే వారిని పోలీసులు అరెస్టు చేశారు. గోషామహల్ పోలీసుస్టేషన్‌కు తరలించి కాసేపటికి వదిలేశారు.

నేడు గన్‌పార్కు వద్ద ధర్నా: మలి విడత బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం చంద్రబాబు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు గన్‌పార్కు వద్ద ధర్నా చేయనున్నారు.