June 13, 2013

ప్రజాస్వా మ్యం అసెంబ్లీ సాక్షిగా ఖూనీ అవుతోందని ఆరోపించారు......

రాష్ట్రంలోప్రజాస్వామ్యం అవహేళనకు గురవుతోందని, స్వయంగా అసెంబ్లీలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని టిడిపిఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మాణానికి మద్దతుగా గన్‌పార్క్ వద్ద వంటావార్పు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు విూడియాతో మాట్లాడుతూ ప్రజాస్వా మ్యం అసెంబ్లీ సాక్షిగా ఖూనీ అవుతోందని ఆరోపించారు. రెండు సార్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన తాను, 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, తాను విూడియా వా ళ్లు కూడా ముచ్చటించుకునే అవకాశాలు లేకుండా స్పీకర్ చేశారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఉన్నట్లుగా తానైతే భావించడం లేదని నియంతృత్వ పోకడలకు ప్రభుత్వం పోతోందని ద్వజమెత్తారు. రాష్ట్రంలో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వందరోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకువస్తామని, వంట గ్యాస్ వంద రూపాయలు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం తుంగలో తొక్కారని ఆరోపించారు. అలాగే 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహారభద్రత కల్పిస్తామని, మూడు రూపాయలకు గోదుమలు, రెండు రూపాయలకు కిలోబియ్యం తోపాటు 30 కిలోలు ఒక్కో కుటుంబానికి అందిస్తామని హామి ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఇందులో ఏది కూడా అమలులోకి తెచ్చిన పాపాన ప్రభుత్వం పోలేదన్నారు. రాష్ట్రంలో 9గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని 30కిలోల బియ్యం తెలుపు రంగు రేషన్ కార్డు దారులకిస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే మూడువందలనుంచి 400 రేట్లు పెరిగిపోయా యన్నారు. అవినీతి, అసమర్థ పాలనవల్లే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయన్నారు. పేద ప్రజలనడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. 12రూపాయలకు కిలో ఉన్న బియ్యం నేడు 55 రూపాయలకు పెరిగిపోయాయని, 13రూపాయలు కిలో ఉన్న చెక్కర నేడు 43 రూపాయలకు పెరిగిపోయిందన్నారు. ఉప కూడా 15 రూపాయలకు పెరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇట్టే అర్థం అవుతుందన్నారు. కూరగాయల ధరలు కూడా ఆకాశంలో తేలియాడుతున్నాయని వంకాయలు నాలుగు రూపాయలు కిలో ఉండగా నేడు 40 రూపాయలకు, పచ్చిమిర్చి అయిదురూపాయలనుంచి 55 రూపాయలకు పెరిగాయని, ఎండు మిర్చి 20 రూపాయలనుంచి వంద రూపాయలకు పెరిగి పోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఇస్టానుసారంగా పెట్రోల్‌ను 29సార్లు, డీజిల్‌ను 22సార్లు పెంచేశారని ఆరోపించారు. దీనివల్ల నిత్యావసర వస్తువులపై కూడా పడుతోందన్నారు. విద్యుత్ చార్జీలు కూడా 25 వేల నుంచి 35వేలకోట్ల రూపాయలకు పెంచారని దీని ప్రభావం వల్ల పరిశ్రమలపై పడడంతో ఆచార్జీలను సైతం పరిశ్రమలు వినియోగదారులపై మోపుతున్నాయన్నారు. అలాగే రాష్ట్రంలో 35లక్షల లీటర్ల పాలు అమ్ముడవుతుంటే నిత్యం 39లక్షల లీటర్ల మద్యం అమ్ముతున్నారన్నారు. నిత్యం పాలపై 9కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుంటే మద్యంపై 0కోట్ల రూపాయలు సమకూర్చుకుంటోందని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇంతటితో ఆగకుండా నిత్యావసర వస్తువులపై కూడా వ్యాట్ పన్నును వేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అమ్మహస్తం పేరుతో 9రకాల నిత్యావసర వస్తువులను ఇస్తామని గొప్పగా చెపకుంటున్న ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామాల్లోకి చేరనేలేదని, ప్రచారం మాత్రం కోట్ల రూపాయలు వెచ్చించి డబ్బా కొట్టుకుంటుందని ఆరోపించారు. పథకం ప్రారభించడం ప్రచారానికిచేసిన ఆర్బాటం అమలులో చూపించడం లేదన్నారు. ఈపథకంలో కూడా నాసిరకమైన వస్తువులను చేర్చి పేద ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతుందని దుయ్యబట్టారు. నిరుపేద మహిళలు పొయ్యిలపై వంటలు చేసుకుంటూ పొగ ద్వారా ఆరోగ్యాలు, కళ్లు చెడిపోతుంటే చూడలేక తాను అధికారంలో ఉన్నపడు 35లక్షల మందికి దీపం పథకం క్రింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని, ఆతర్వాత ఇప్పటివరకు ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సమస్యలపై చర్చిద్దామంటే అసెంబ్లీని నడిపించలేకుండా వాయిదాలు వేస్తూ తప్పించుకుంటుందని ఆరోపించారు. స్పీకర్‌గా సభను నడిపించడంలో మనోహర్ పూర్తిగా విఫలం అయ్యారన్నారు. నాలుగేళ్లుగా స్పీకర్‌గా తాను సాధించింది ఏమిటో ఒకసారి ఆలోచించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జవాబుదారీతనం లోపించిందన్నారు. ప్రజా సమస్యలపై చర్చిస్తే ప్రభుత్వ తప్పిదాలు బయటకు వస్తాయని, సమాధానం చెపకోలేక పోతుందనే చిన్నచిన్న కారణాలతో వాయిదాలు వేసుకుంటూ పోతూ ఆనంద పడిపోతున్నారని స్పీకర్‌పైన, ముఖ్యమంత్రి, మంత్రులపై ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని, ప్రతిపక్షంపైన ఓమంత్రి కుక్కతోక వంకర అంటూ తీవ్రంగా విమర్శించినా కూడా స్పీకర్ అసెంబ్లీలో క్షమాపణ చెప్పించకుండా వాయిదా వేశారని ఆరోపించారు. కేవలం రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పడం శోచనీయమని, అప్పటికే ప్రజల్లోకి విూడియా ద్వారా వెళ్లిపోయిందన్నారు. రికార్డులనుంచి తొలగించడం ఎవరికి కావాలని చంద్రబాబు స్పీకర్‌పై విరుచుకు పడ్డారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వం తీరుమారకపోతే పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఎలాగూ ప్రభుత్వానికి సమాదికట్టే రోజులు దగ్గర పడుతూనే ఉన్నాయని రాబోయే ఎన్నికల్లో గద్దెదిగడమే కాక ఘోరాతి ఘోరంగా ఓటమిని రుచి చూపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని బాబు హెచ్చరించారు.