June 13, 2013

స్పీకర్‌పై దేశం నిప్పులు జాతీయ జెండాను అవమానిస్తున్నారు ప్రభుత్వ విధుల్లో తలదూరుస్తున్నారు



లేఖ రాస్తాం.. మారకుంటే చూస్తాం

సభా సంప్రదాయా లను తుంగలో తొక్కి అధి కార పార్టీ ఏజెంట్‌గా వ్యవహ రిస్తోన్న శాసనసభ స్పీకర్‌ తన పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ధ్వజ మెత్తింది. ఆ పార్టీ శాసనసభా పక్షం బుధవారం చంద్రబాబు నాయుడు నివాసంలో సుదీర్ఘంగా సమావేశమైంది. అనంతరం, రాత్రి ఆ పార్టీ అధికార ప్రతినిధి గాలి ముద్దు కృష్ణమ నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌గజపతి రాజు, ఎమ్మెల్యే ఎల్‌. రమణ చంద్రబాబు నివాసం ఎదుట విలేకరులతో మాట్లాడారు. ''స్పీకర్‌ పదవి ఉన్నతమైంది. ఆ స్థానంలో కూర్చునే వ్యక్తులు పార్టీల రంగులను సూచించే కండువాలు కప్పుకోరు. ఈ స్పీకర్‌ మాత్రం కాంగ్రెస్‌ మార్కు మూడు రంగుల కండువా కప్పుతారు. అదేమంటే- అవి జాతీయ జండా రంగులు అంటారు. జాతీయ జెండాను స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంతో పాటు ఇతర జాతీయ పండుగల సందర్భాల్లో ధరించడం సంప్రదాయం. అనునిత్యం ఎవరూ ధరించరు. ఒకవేళ అది మన జెండాను ప్రతిబింబించే కండువా అని భావించినా.. స్పీకర్‌ దాంతో ముఖం తుడుచుకోవడం జాతీయ జెండాను అవమానించడం కిందికే వస్తుంది'' అని గాలి స్పష్టం చేశారు. ఆయన ఠక్కున సభను వాయిదా వేస్తారు. ఆ వెంటనే అసెంబ్లిd నుంచి వెళ్లిపోతారు. స్పీకర్‌తో ప్రస్తావించాల్సిన అత్యవసర అంశాలు ఏమైనా ఉంటే ఇంటికి వెళ్తాం. ఇంటి వద్ద కలవొద్దు అంటారు. ఇదేం పద్ధతి? అలా భావిస్తే ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగవచ్చు. స్పీకర్‌గా ఎందుకు కొనసాగడం అని నిప్పులు చెరిగారు.

స్పీకర్‌ విధి శాసనసభను సజావుగా నడపడం మాత్రమే. చరిత్రలో ఏ స్పీకర్‌ చేయని విధంగా ప్రభుత్వం చేసే పనుల్లో ఈయన జోక్యం చేసుకుంటారు. శాసనసభ సభ్యులను వెంట వేసుకుని సొంత జాగీరులాగా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఫ్లోరైడ్‌ పీడిత ప్రజలను పరామర్శిస్తారు. ఆ పని చేసేందుకు ప్రభుత్వం ఉంది. స్పీకర్‌ తన పరిధిని అతిక్రమించారని ''దేశం'' నేతలు విరుచుకుపడ్డారు.

ఆయన కేవలం రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యే. మాలో అశోక్‌ గజపతి రాజు ఏడుసార్లు గెలిచారు. అయిదారు సార్లు గెలిచిన చరిత్ర మాకుంది. కౌల్‌ అండ్‌ షక్దర్‌ నిబంధనావళి మాకు కంఠోపాఠం. అధికార పక్షంగా.. విపక్షంగా సుదీర్ఘ అనుభవం మాకుంది. అద్భుతంగా మాట్లాడగలిగే మా కొత్త సభ్యులకు స్పీకర్‌ అవకాశం కల్పించడం లేదు. మా కొత్త సభ్యుల్లో సగం మంది సభలో ఇంకా నోరు విప్పలేదని ముద్దు కృష్ణమ చెప్పారు.

మా నేత నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా 1979లో శాసనసభకు ఎన్నికయ్యారు. 1980లోనే మంత్రివర్గంలో చేరారు. ఆ తర్వాత ఎందరో నేతలను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా తయారు చేశారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవులకు ఆయా వ్యక్తులను ఎంపిక చేయడంలో కీలక భూమిక పోషించారు. ఆయన ప్రస్తుతం సభలో విపక్ష నేతగా కొనసాగుతున్నారు. సభలో సభా నాయకుడు (సాధారణంగా ముఖ్యమంత్రి), ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు మైక్‌ కట్‌ చేయకూడదు. సమయాన్ని గుర్తు చేయకూడదు. ఆ సంప్రదాయాలను ఆయన తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సభలో తప్పుడుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

లేఖ రాస్తాం.. తదుపరి నిర్ణయిస్తాం

''స్పీకర్‌ చేస్తూ వస్తోన్న తప్పులను వరుసగా గుర్తించి ఒక లేఖను రూపొందిస్తాం. ఆ లేఖను ఆయనకే అందజేస్తాం. ఆయన తప్పులు సవరించుకుంటే మంచిది. కాని పక్షంలో ఏం చేయాలన్నది తదుపరి నిర్ణయిస్తాం'' అని స్పీకర్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారా? అన్న ప్రశ్నకు జవాబుగా ముద్దు కృష్ణమ చెప్పారు.

వాటిని బహిష్కరించాం

తమ సమావేశంలో సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానెల్‌, టి- చానెల్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామని గాలి ముద్దు కృష్ణమ నాయుడు తేల్చి చెప్పారు. అవి ఆయా రాజకీయ పక్షాలకు అనుబంధంగా పని చేస్తూ తమ సొంత ఎజెండాను రుద్దుతున్నాయని ఆరోపించారు. ఇక ముందు తాము నిర్వహించే పాత్రికేయ సమావేశాలకు ఆయా సంస్థల ప్రతినిధులు రావాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఇదే విధానాన్ని అనుసరించాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.