June 13, 2013

గరిటె తిప్పిన బాబు


టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గరిటె తిప్పారు. ఔను నిజం. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రతి రోజు ఒక అంశంపై గన్‌పార్క్ వద్ద ధర్నా చేయాలని టిడిపి నిర్ణయించింది. దీనిలో భాగంగా గురువారం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా గన్‌పార్క్ వద్ద వంటా వార్పు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సీతక్క కట్టెల పొయ్యిను ఊదుతూ వంట వండుతుంటే చంద్రబాబునాయుడు గరిటె తిప్పారు. మరో ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ వంటకు సహకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్లనే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని విమర్శించారు. వంద రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ సంగతి మరిచిపోయిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 300 నుంచి 400 శాతం వరకు ధరలు పెరిగాయని తెలిపారు. అవినీతి, అక్రమాలు తప్ప కాంగ్రెస్‌కు ప్రజా సమస్యలు పట్టవని అన్నారు. శాసన సభలో ప్రజల సమస్యలు ఏ మాత్రం చర్చించడం లేదని విమర్శించారు. సభను సజావుగా జరిపించాల్సిన బాధ్యత స్పీకర్‌కు లేదా? అని ప్రశ్నించారు.