June 10, 2013

ఎపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి : చంద్రబాబు


ఎపీపీఎస్సీని ప్రక్షాళన చేసేంత వరకు టీడీపీ రాజీలేని పోరా టం చేస్తుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కమిషన్‌ ప్రక్షాళన కోరకు వెంటనే సభ్యులందరీ చేత రాజీనామా చేయించాలని, లేనిపక్షంలో డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమర్ధులు, నీతివంతులైన అధికారుల చేత కమిషన్‌ తిరిగి పునరుద్ధరించాలని గవర్నర్‌ నర్సింహన్‌కు చంద్రబాబు సూచించారు. ఎపీపీఎస్సీ సభ్యుల అవినీతి, అక్రమాలపై సోమవారం సాయంత్రం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ శాసనసభ్యులు, మండలి సభ్యుల బృందం గవర్నర్‌ నర్సింహన్‌ను కలుసుకుని వినతిపత్రం సమర్పించింది. అనంతరం ఎన్టీఆర్‌భవన్‌ వద్ద చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో వ్యవస్థలన్నింటినీ పూర్తిగా భ్రష్ఠు పట్టించారని మండిపడ్డారు. గతంలో వైఎస్‌, ఆతరువాత రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డిలు ఎపీపీఎస్సీని కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల పునరావాసకేంద్రంగా మార్చా రంటూ ధ్వజమెత్తారు. ఉద్యోగాలను బజారులో కూరగాయల మాదిరిగా రేటు కట్టి విక్ర యిస్తూ ఎపీపీఎస్సీ సభ్యులుగా వ్యవహరిస్తున్నవారంతా యువత జీవితంతో ఆడుకుంటున్నారని శివాలెత్తారు.

గతంలో రిపుంజయరెడ్డి అనే సభ్యుడు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉంటే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారన్నారు. ఇప్పుడేమో సీతారామారాజు అనే మరో సభ్యుడు ఒక మహిళా దళారీ ఇంట్లో పేకాట ఆడుతూ లంచం తీసుకునేలా ఆమెను ప్రోత్సాహించి అడ్డంగా దొరికిపో యారన్నారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎపీపీఎస్సీ సభ్యులుగా నియామకానికి ఐదు మంది సభ్యులు చేసుకున్న దరఖాస్తు వివరాలను గవర్నర్‌కు చంద్రబాబు అందజేశారు. ఐదు మంది కాంగ్రెస్‌ పార్టీ క్రియాశీలక కార్యకర్తలు కాగా, ఒకరు కేంద్ర మంత్రి ఆశీస్సులతో సభ్యునిగా నియమితులయ్యారన్నారు. ఆయన తక్కువేమి కాదని పరీక్ష ప్రారంభమైన గంట సేపటి తరువాత తొమ్మిది మంది అభ్యర్థులను అనుమతించిన వ్యక్తి అంటూ ఎద్దేవా చేశారు. ఎపీపీఎస్సీ సభ్యుల ప్రక్షాళన కోరకు, కమిషన్‌ సభ్యుల అవినీతిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.