June 10, 2013

మోడీ ప్రభావం ఉండదు

దేశ రాజకీయాల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభావం ఉండబోదని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. సోమవారం టిడిఎల్‌పి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మోడీకి బిజెపి ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు, అద్వానీ రాజీనామా అంశాలపై స్పందించారు. మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తికి గురైన అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేయడం గురించి ప్రశ్నించగా, అది బిజెపి అంతర్గత వ్యవహారమన్నారు. రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన విధానాలనే గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ అమలు చేస్తున్నారన్నారు. మోడీ మీరు జత కడితే బాగుంటుందనే అభిప్రాయం వినిపిస్తోందని ఒక విలేఖరి ప్రశ్నించగా, టిడిపి మత సామరస్యానికి కట్టుబడి ఉందని, లౌకిక విధానం నుంచి పక్కకు జరిగేది లేదని, ఈ పరిస్థితుల్లో బిజెపితో కలవలేమన్నారు. ప్రాంతీయ పార్టీల హవా సాగుతుందని కాంగ్రెస్, బిజెపిల ప్రభావం తగ్గిపోయిందన్నారు. కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీగా మారింది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ బాగా క్షీణించింది. బిజెపి పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగిందని, ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో తృతీయ కూటమి ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో తన ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలనే గుజరాత్‌లో మోడీ అనుసరించారని చెప్పుకున్నారు.
తెలంగాణ తీర్మానం సాధ్యం కాదని సిఎం చెప్పారు
తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయడం సాధ్యం కాదని, అది కేంద్రం తీసుకోవలసిన నిర్ణయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బిఎసి సమావేశంలో చెప్పినట్టు చంద్రబాబు తెలిపారు. అనేక ప్రజా సమస్యలు ఉన్నాయని, సభలో ఈ సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. తీర్మానం సాధ్యం కాదని సిఎం చెబుతున్నందున దీనిపై మీ పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమం చేపడతారని ఒక విలేఖరి ప్రశ్నించగా, తరువాత మాట్లాడదాం అంటూ చంద్రబాబు దాట వేశారు. (చిత్రం) టిడిఎల్‌పిలో సోమవారం విలేఖర్లతో మాట్లాడుతున్న దేశం అధినేత చంద్రబాబు