May 18, 2013

అవినీతి తీవ్రవాదం కంటే ప్రమాదకరం

ఆర్ధిక వ్యవస్థ అనారోగ్యం ఆర్ధిక
ఆర్ధిక సంస్కరణల ఫలితాలు పేదలకు
అందడం లేదు : టీడీపీ అధినేత చంద్రబాబు


హైదరాబాద్‌ అవినీతి తీవ్రవాదం కంటే ప్రమాదకరమయిందని, దేశంలో ఎవరు అవినీతికి పాల్పడకపోతే పేదరికమే ఉండదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అనారోగ్యం పాలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. శనివారం చంద్రబాబును ఆయన నివాసంలో వాకర్స్‌ అసోసియేషన్‌, విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన ఆర్ధిక విధానాల వల్లే దేశ ఆర్ధిక వ్యవస్థలో పెనుమార్పులకు దారితీసిందన్నారు.అయితే ఆర్ధిక సంస్కరణల ఫలితాలు సామాన్యులకు చేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అన్ని రంగాల్లో అవినీతి గుర్రపు డెక్కల మాదిరిగా అల్లుకుపోవడమే ప్రధాన కారణమని చంద్రబాబు విశ్లేషించారు. దేశంలో 500, 1000 నోట్ల రూపాయలను రద్దు చేస్తే అవినీతి అడ్డుకట్ట వేయవచ్చునని అభిప్రాయపడ్డారు. ఆర్ధిక నేరస్థులను శిక్షించేందుకు కఠిన చట్టాలు రావాలన్నారు. 2030 నాటికి భారత్‌, చైనాలు శక్తివంతమైన దేశాలుగా అవతరిస్తాయన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల ప్రజలు తీర్పునిచ్చారని, అదే తీర్పు రాష్ట్రంలో పునారవృత్తం కాబోతోందన్నారు. వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, విశ్రాంత ఉద్యోగులందరూ ప్రజా ఆరోగ్యం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి 2817 కిమీ పాదయాత్ర చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని విపక్ష పార్టీల నేతలు ఎస్‌ఎం కృష్ణ, దిగ్విజయ్‌సింగ్‌లాంటి వారు పరిపాలనా చేశారని ఫారెస్ట్‌ మాజీ అధికారి భూపాల్‌రావు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 18 గంటలు పనిచేసి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారన్నారు.

ఇంచార్జిలను నియమించే బస్సుయాత్ర చేస్తాః చంద్రబాబు
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జిలను నియమించిన తరువాతే బస్సుయాత్ర చేపడుతానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పార్టీ నేతలతో ఆయన తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీలో సీనియర్‌, జూనియర్‌ అన్న ప్రతిష్టకు పోకుండా ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలంతా కష్టపడి పనిచేయాలని ముఖ్యనాయకులకు ఆయన హితవు పలికారు. రానున్న ఎన్నికలు కీలకమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు.