May 18, 2013

టీడీపీతోనే ప్రజాసమస్యల పరిష్కారం


చింతకాని: టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలోని సమస్యలు పరిష్కారమవుతాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరావు పేర్కొన్నారు. మండలం పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన మధిర నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తే.. షర్మిల మాత్రం తమ అక్రమ ఆస్తులు చూసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులను అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడినవారికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన జంప్ జిలానీల నుద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో ఆయన తనయుడు జగన్ అప్పనంగా ప్రజాధనాన్ని దోచుకోవడానికి కారకులైన కళంకిత మంత్రులను పదవుల నుంచి తొలగించకుండా సీఎం కాపాడుతున్నారని ఆరోపించారు. పాలకుల విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ,విద్యుత్ రంగాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయన్నారు. తాము అధికారంలోకి వస్తే తొలుత రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు. మినీ మహానాడులో వ్యవసాయ రంగం,పాదయాత్రతో గ్రామాలలో గుర్తించిన సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై పోరాటం, స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గ స్థాయి సమస్యలపై తీర్మానాలు చేశారు. ఈ మినీ మహానాడుకు నియోజకవర్గ పార్టీ శ్రేణులు కదిలిరావడంతో గ్రామంలో సందడి కనిపించింది. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు మందడపు సుధాకర్, గుత్తా వెంకటేశ్వరావు, బీరెడ్డి నాగచంద్రరెడ్డి,బ్రహ్మం, శివరాంప్రసాద్, చావా రామకృష్ణ, స్థానిక నాయకులు పెంట్యాల పుల్లయ్య, చల్లా అచ్చయ్య, వంకాయలపాటి లచ్చయ్య, రత్నాకర్, బడేసాహెబ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.