May 18, 2013

వైసీపీ నేతలవి కాకి అరుపులు : రేవంత్‌రెడ్డి



హైదరాబాద్ : సీబీఐవి చిలక పలుకులు అయితే వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నాయకులవి కాకి అరుపులని టీడీపీ నేత రెవంత్‌రెడ్డి అన్నారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో జగన్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ క్లీన్‌చీట్ ఇచ్చినప్పుడు సీబీఐ మంచిదైందని, ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ చేస్తున్న విచారణ కుట్రపూరితమైందని అనడం సరికాదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, రాజకీయ కక్షతోనే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తున్న వాదనల్లో నిజం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, అయినా ఆ పార్టీకి కనువిప్పు కలగడం లేదని ఆయన అన్నారు. ఆర్థిక నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని రేవంత్‌రెడ్డి అన్నారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎందుకు పోరాటం చేయడం లేదని, వైయస్సార్ కాంగ్రెసు అవినీతిని సమర్థిస్తుందా అని ఆయన అన్నారు. అవినీతి మంత్రులపై తాము పోరాటం చేస్తున్నామని, వారిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. తాము ఈ నెలాఖరులో రాష్ట్రపతిని కలుస్తామని, కళంకిత మంత్రులను తొలగించాలని కోరుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఢిల్లీ వీధుల్లో రాష్ట్రం పరువు తీస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు.