May 18, 2013

మూడు నెలల్లో వైకాపా దుకాణం మూత

విజయవాడ:వైయస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌.జగన్‌ బయటకు రాడు, మూడు నెలల్లో వైయస్‌ఆర్‌ పార్టీ దుకాణం మూతపడం ఖాయమని, దుకాణ్‌బంద్‌ అవుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పామర్రు ఇన్‌చార్జి వర్ల రామయ్య జోస్యం చెప్పారు. బందరు రోడ్డులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అన్న వస్తాడు-రాజన్న రాజ్యం తెస్తాడు’ అని జగన్‌ చెల్లి షర్మిల చెబుతుందని, అమ్మా చెల్లి అన్న రాడు, రాజన్న రాజ్యం తేలేడని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ చాలా స్పష్టంగా జగన్‌ కేసులో సాక్ష్యాలను నమ్ముతోందని, బెయిల్‌ నిరాకరించటం జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు.
చుక్కాని లేని నావ వైయస్‌ఆర్‌ పార్టీ, పైలెట్‌ లేని విమానం వైకాపా అని ఆ పార్టీ డ్రైవర్‌ లేని బస్సులా తయారు కానుందన్నారు. ఆ పార్టీ పైలెట్‌ లక్ష కోట్లు దోచుకుని జైలులో ఉన్నాడని విమర్శించారు. ఓ చెల్లీ నీ అన్న వల్లనే కదమ్మా ఐఎఎస్‌ అధికారి జైలులో ఉండి పక్షవాతానికి గురయ్యాడని గుర్తు చేశారు. బీసీ మంత్రి మోపిదేవి జైలు పాలవ్వడానికి, నిమ్మగడ్డ ప్రసాద్‌, కోనేరు ప్రసాద్‌, బి.పి.ఆచార్య, రాజగోపాల్‌ తదితరులందరూ జైలులో మగ్గడానికి జగనే కారణమని ఆరోపించారు. మంత్రులు ధర్మాన, సబితా ఇందిరారెడ్డి కూడా జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రాజన్న రాజ్యం వల్లే కదా పైన పేర్కొన్న వారందరూ జైలు పాలయ్యింది, రాజన్న రాజ్యం వల్లే కదా జగన్‌ లక్ష కోట్లు దోచుకుంది, ఇంకా రాజన్న రాజ్యం తెస్తానంటున్నావు ఈ మాత్రం కూడు కూడా రాష్ట్ర ప్రజలకు ఉంచవా అని షర్మిలను నిలదీశారు.

అన్న రాడు, చెల్లి యాత్రకు ముగింపు ఉండదు, ఇక నుండి ఏ పార్టీ నుండైన ఒక ఎమ్మెల్యే మీ పార్టీలోకి వస్తాడా అని సవాల్‌ విసిరారు. దోచుకున్న డబ్బును రక్షించుకునేందుకే కవచంగా వైయస్‌ఆర్‌ పార్టీని, టీవీ ఛానల్‌ను, పత్రికను ఏర్పాటు చేసుకున్నారని వర్ల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తాండవిస్తుంది, వైయస్‌.బతికుంటే ప్రతి కేసులో ముద్దాయి అయి పైనాయకుల కంటే ముందే జైలులో ఉండేవారని వర్ల జోస్యం చెప్పారు. చనిపోయి రాజశేఖర్‌రెడ్డి బతికిపోయారని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దని చెల్లి షర్మిలకు వర్ల హితవు పలికారు.