March 18, 2013

పాదయాత్ర రూట్ వివరాలు

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వచ్చే నెల మూడో తేదీ రాత్రి తూర్పుగోదావరి జిల్లా తునికి చేరుకుని అక్కడ బసచేస్తారు. మరుసటి రోజు ఉదయం పాయకరావుపేట నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తాండవ, మాకవరపాలెం, కన్నూరుపాలెం, తాళ్లపాలెం, నర్సింగబిల్లి, సోమవరం, చూచుకొండ, గణపతి, హరిపాలెం, తిమ్మరాజుపాలెం, మునగపాక, అనకాపల్లి టౌన్, సబ్బవరం, పెందుర్తి మీదుగా విశాఖ నగరంలోకి ప్రవేశిస్తారు. అనంతరం గోపాలపట్నం, ఎన్ఎడీ జంక్షన్, కంచరపాలెం, జ్ఞానాపురం, పూర్ణామార్కెట్, జగదాంబ, ఆర్టీసీ కాంప్లెక్స్, మద్దిలపాలెం, హనుమంతువాక మీదుగా భీమిలి నియోజకవర్గంలోకి అడుగు పెడతారు.విశాఖపట్నం

రెండు నెలల కిందట పెందుర్తిలో జరిగిన సంఘటనను విభేదించానే తప్ప పార్టీపై ఎప్పుడూ తాను పోరాటం చేయలేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీపై కానీ, వ్యక్తులపై గాని పోరాడే వ్యక్తిత్వం తనది కాదన్నారు. అయితే సంఘటనపై విభేదిస్తానని చెప్పారు. కాగా గతంలో జరిగిన సంఘటన వివాదం ముగిసిందని, ఇకనుంచి అందరం కలిసికట్టుగా జిల్లాలో పార్టీని బలోపేతం చేసి 2014 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు పనిచేయాలని సూచించారు. వచ్చే నెలలో జిల్లాలో చంద్రబాబు చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యాలయానికి అయ్యన్న 'రీ ఎంట్రీ' అంటూ 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన కథనంపై ఆయన స్పందిస్తూ... 1983లో పార్టీలోకి ఎంట్రీ అయ్యానని వివరణ ఇచ్చారు.

రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ మాట్లాడుతూ, వచ్చే నెలలో చంద్రబాబు పాదయాత్రకు అందరూ సహకరించాలని కోరారు. సుమారు పది రోజుల పాటు జిల్లాలో అధినేత పాదయాత్ర చేస్తారని, మే ఒకటితో చంద్రబాబు పాదయాత్ర ముగుస్తుందన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ, రెండు నెలల కిందట జరిగిన సంఘటన తర్వాత మళ్లీ కార్యకర్తలు రాకతో కార్యాలయం కళకళలాడిందని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

సమావేశంలో సీనియర్ నేతలు పప్పల చలపతిరావు, ఆర్ఎస్‌డీపీ అప్పల నరసింహరాజు, గుడివాడ నాగమణిలతో పాటు కోన తాతారావు, పీలా శ్రీనివాసరావు, లాలం భాస్కరరావు, గుడివాడ అమర్‌నాథ్, పైల ముత్యాలనాయుడు, కళ్లేపల్లి విజయలక్ష్మి, కేకే రాజు, బొట్టా వెంకటరమణ, టాక్సీరాజు, పోతన్నరెడ్డి, పాశర్ల ప్రసాద్, మళ్ల అప్పలరాజు, విజయకుమార్, అన్నంరెడ్డి వాణి, తోట రత్నం, నర్గీస్, ప్రభావతి, గొర్లె వెంకునాయుడు, కాళ్ల శంకర్, సుజాత, పులి వెంకటరమణారెడ్డి, నీలాపు వెంకటరమణ, స్వర్ణలత నక్కా కనరాజు, నడిగట్ల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.