March 18, 2013

బాబు వెనకే ప్రజాకెరటం

 అదిగో చంద్రబాబు వస్తున్నాడు అంటూ ఉరుకులు, పరుగులు. అప్పటికే రోడ్లకిరువైపులా కిక్కిరిసిన జనం. వయసుపైబడి నాలుగు అడుగులు వేయడం కష్టంగా ఉన్న పండు ముదుసళ్లు కూడా కళ్లజోళ్లు సవరించుకుని ఆయన కోసం ఎదురుచూపులు.. బహుదూరపు బాటసారికి సంఘీభావం తెలిపేందుకు చేతిలో పూలు పట్టుకుని చిన్నారుల హడావుడి. నృత్యాలు చేస్తూ యువకులు, హారతులు ఇస్తూ మహిళలు, దీవెనలు ఇస్తూ రైతులు ఇలా ఒకరికొకరు తోడై జనప్రవాహమయ్యారు.

సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తోడుగా నిలిచారు. వస్తున్నా మీకోసం అంటూ మీరు వస్తుంటే మేము కూడా మీవెంటే నంటూ కొన్ని గ్రామాల్లో మహిళలు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తామయ్యా, మా కష్టాలు మీరే తీర్చాలంటూ మరికొన్నిచోట్ల వేడుకోలు వెరసి 169వ రోజైన సోమవారం చంద్రబాబు జనం మధ్యలో నిండు చంద్రుడిలా మెరిశారు. వెలుగులు చిందించారు. జిల్లాలో ఆయన ఉప్పుటేరు నుంచి పాదయాత్ర ప్రారంభించి కాకరపర్రు వరకు వంద కిలోమీటర్ల పాదయాత్రను ఆదివారం పొద్దుపోయిన తర్వాత పూర్తి చేశారు. తిరిగి సోమవారం కాకరపర్రు నుంచి బయలుదేరి 15 కిలోమీటర్ల మేర ప్రయాణానికి మధ్యాహ్నం మూడున్నర గంటలకే ఉపక్రమించారు. ఉదయాన్నే గోపాలపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాన్ని పూర్తి చేసుకుని, ఆ వెంటనే విలేకరుల సమావేశంలో పాల్గొని వెంటనే పాదయాత్రకు సిద్ధమయ్యారు.

మునిపల్లిలో రోడ్డుపక్కన ఆయన ఆగిన వారిని పలకరించినప్పుడు అక్కడ ప్రజలు అసలు కష్టాలను ఆయన ముందుంచారు. ఏకంగా మహిళలు తమ గోడును ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకున్నారు. 'కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం. ఒక బుడ్డి (ఒక లైట్) ఉంటేనే ఐదొందలు వరకు బిల్లులు వేస్తున్నారు. కట్టలేకపోతున్నాం' అంటూ బావురమం ది. రూపాయి బియ్యం ఇవ్వాల్సిందే. లేకపోతే ఏదైనా తాగి చావాల్సిందే, ఎవరూ మమ్మల్ని లెక్కచేయట్లేదు. మీరే మాకు దిక్కు అంటూ తన మొరవినిపించింది. చంద్రబాబు ఆ మహిళను ఊరడించారు. నీకేం భయంలేదు. పార్టీని అధికారంలోకి తీసుకురండి మీ కష్టాలన్నీ పోతాయి. కరెంటు సమస్యలన్నీ తీరుస్తానని భరోసా ఇచ్చారు.

వంట చేసుకోవాలంటే గ్యాస్ ఇబ్బందులు, మీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని మరో మహిళ అన్నా రు. మీరు సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు, కానీ మేము ఆర్టీసీ ఛార్జీలు తట్టుకోలేక రోజూ పాదయాత్ర చేస్తున్నామని రాజేష్ అనే మరో విద్యార్థి తన గోడు చెప్పాడు. రైతులుగా మేము నీటి ఇబ్బందుల్లో ఉన్నాం. కాలువలకు సరిగ్గా నీళ్లు రావడం లేదు. ఏం చే యాలో అర్థమే కావడం లేదని పెం డ్యాల సెంటర్‌లో మరికొందరు రైతు లు ఆవేదన వెళ్లగక్కారు.

రూపాయి బియ్యం తీసేస్తే తీసేశారుగానీ, కరెంటు బిల్లులు తగ్గించండి, మా కేమీ వద్దంటూ ఇంకో మహిళ చంద్రబాబు కు విజ్ఞప్తి చేసింది. టీడీపీకి ఓటేస్తాం. మిమ్మల్ని అధికారంలోకి తీసుకువస్తాం. దాని కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామని మరో మహిళ బాబుకు మద్దతు ప్రకటించారు. అలాగే కలవపల్లి, ముప్పవరం గ్రామాలతో సహా అన్ని చోట్లా ఆయన సాగే మార్గంలో వందలాది మంది ఎదురేగి ఇలాంటి సమస్యలనే వినిపించారు. బాబు కూడా కాంగ్రెస్ అసమర్థత, అవినీతి కారణంగానే ఇలాంటి పరిస్థితి దాపురించిందని పార్టీ గెలుపు ఒక చారిత్రక గెలుపు అయ్యేలా మీరు సహకరించి దీవెనలు అందిస్తే ఈ కష్టాలన్నింటినీ తొలగిస్తామని భరోసా ఇచ్చా రు.

ఆయన పాదయాత్రకు సోమవారం జనం బ్రహ్మరథం పట్టారు. అన్నిచోట్లా వందలాది మంది ప్రవాహంలా ఆయన వెంట సాగారు. అన్నింటికంటే మించి పల్లెల కూడళ్లలో కూడా ఉత్సాహం వెల్లివిరిసింది. ఎమ్మెల్యే శే షారావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీ తారామలక్ష్మి, పార్టీ కన్వీనర్లు ఆయన వెంటే ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలైతే ఉత్సాహం పట్టలేకపోయారు. మోటారు బైక్‌లతో సందడి చేశారు. ప్రతి ఊళ్లోనూ పార్టీ పతాకాలతో, ఫ్లెక్సీలతో పసుపు మయం చేశారు. సోమవారం యాత్రలో బాబు కూడా దారిపొడవునా అనేక వర్గాలను కలిశారు. లారీ ఎక్కి ఒకసారి, స్కూటర్ నడిపి ఇంకోసారి వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

మధ్యాహ్నం నుంచే యాత్ర ప్రారం భం కావడంతో ఆయన పర్యటించే ప్రాంతాలన్నీ జనంతో పొద్దుపోయేంత వరకు కిక్కిరిసి కన్పించాయి. చిన్నారులు సైతం బాబుతో షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పోటీలు పడ్డారు. బడి పిల్లలు పువ్వులతో ఎదురేగి బాబుపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో రెండవ రోజు పాదయాత్ర జనసంద్రం మధ్య సాగింది.