March 6, 2013

వ్యాట్.. అందరిపై వేటే!

కూడు, గూడు, గుడ్డ అనేవి ప్రజల కనీస అవసరాలు. గుడ్డ కట్టిన తరువాతే మానవుడు నాగరికుడయ్యాడు. అలాంటి బట్ట నేసేవాడికి కూడు లేదు. ఆ బట్టను అమ్ముకొనే వారికి అసలు బతుకే లేదు. వ్యాట్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ.. నా మద్దతు కోసం వచ్చి కలిసిన వస్త్ర వ్యాపారులు వినిపించిన గోడు సారాంశమిది. నడక మొదలుపెట్టిన అనంతపురం నుంచి ప్రతి జిల్లాలోనూ వీరు నన్ను కలుస్తూనే ఉన్నారు.

ప్రతిసారీ వాళ్ల కోసం నేను గొంతెత్తూనే ఉన్నాను. నిజానికి.. వాళ్ల పోరాటం కేవలం సొంత లాభాలు, ప్రయోజనాలు, లబ్ధి కోసమే అయితే ఇంత ఆలోచించాల్సిన పని లేదు. నిజానికి.. వ్యాట్‌వల్ల నష్టపోయేవారిలో సామాన్యులూ ఉన్నారు. వారి కోసమూ జరుగుతున్న పోరాటమిది. అందుకే అందరూ వ్యాట్‌ని వ్యతిరేకించాలని చెబుతున్నాను. వస్త్ర వ్యాపారులను కాపాడుకోవడం ఒకరివల్ల అయ్యేది కాదు.. అందరం కలిసి.. సాగించాల్సిన పోరాటం. ఈ పోరాటంలో వాళ్లను మనం ఒంటరిగా వదిలిపెట్టలేం కదా!

పని చేయడానికి తప్ప ఈ చేతులు తిండి తినడానికి లేవా! ఒళ్లు దాచుకోకుండా కష్టపడే ఈ మనుషులకు పిడికెడు అన్నం పెట్టలేమా? చౌడేపల్లి, పెదపాలపర్రులో రైస్‌మిల్లులో పనిచేసే హమాలీలను కలిసినప్పుడు కలిగిన వేదన ఇది. ఏడాదిలో నాలుగు నెలలే పని దొరుకుతుందట. మిగతా కాలం వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి లేదట. 'ఏం చేయాలంటారు సార్..'' అని ప్రశ్నిస్తుంటే ఏమి చెప్పాలో అర్థం కాలేదు. యాజమాన్యాలను మాత్రం ఎలా తప్పుపట్టగలం? కరెంటు కోతలతో తద్వారా పుట్టెడు అప్పులతో, పెట్టుబడి నష్టాలతో కోలుకోలేనంతగా కుంగిపోయి ఉన్నారు. ఇక అడగాల్సింది.. కడగాల్సింది ఈ పాలకులనే.. నా పాదయాత్రలో నేను చేస్తున్న పనీ ఇదే!