March 6, 2013

గుడివాడ అంటేనే ఎన్టీఆర్

'మహానేత ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పుణ్యభూమి గుడివాడ. రాజకీయాల్లో చరిత్ర సృష్టించి దివికేగిన ఎన్టీఆర్ ఫొటోలు దేవుళ్ళ పక్కన పెట్టడం సముచితం. కానీ ఆ యుగపురుషుడి ఫొటోలు లక్షల కోట్లు తిన్న రాబందుల పక్కనపెట్టడం దుర్మార్గం.పిల్ల కాంగ్రెస్‌కు ఓట్లేస్తే కేసుల మాఫీకు వాడుకుంటుంది. టీడీపీకి అధికారం కట్టబెడితే ప్రజల కష్టాలు తీరుస్తుందని'' గుడివాడ సభలో చంద్రబాబు అన్నారు.


గుడివాడటౌన్: గుడివాడ అంటేనే ఎన్టీఆర్ అని ఆయన రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచే ప్రారంభమైందని కుప్పం తర్వాత గుడివాడకే తాను ప్రాధాన్యత ఇస్తానని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా ఆయన గుడివాడ నెహ్రూ చౌక్‌లో మంగళవారం రాత్రి ప్రసంగించారు. ఎన్టీఆర్‌కు సాటిగల నాయకుడు లేడని, రాడని, రాబోడని ఉద్ఘాటించారు. రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ప్రస్తుతించారు. ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో తెలుగువారిని మద్రాసిీలుగా పిలిచేవారని, అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి తెలుగు తేజాన్ని దశ దిశలా చాటారన్నారు.

ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారన్నారు. దీంతో గుడివాడ చరిత్రకెక్కిందన్నారు. కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గుడ్డి కరెంట్‌తో గుడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఇంతటి చేతగాని అవినీతి అసమర్థ ప్రభుత్వాన్ని తాను చూడలేదన్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే ఆధార్ ఎక్కౌంట్‌లో డబ్బులు సైతం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతాయన్నారు. తమ హయాంలో లోఓల్టేజ్, కరెంట్ కోతలు లేవన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చామన్నారు. సెల్‌ఫోన్లు, రోడ్లు తమ ప్రభుత్వ ప్రతిభేనని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలో ఉంటే కేజీ బేసిన్ల గ్యాస్ ప్రథమ వాటా రాష్ట్రానికే దక్కేదన్నారు. సహజ వనరులను సైతం స్వలాభానికి దోచుకున్న రాజశేఖరరెడ్డి వల్ల రాష్ట్రానికి అనేక అనర్థాలు జరిగాయన్నారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ దొంగలను పొలిమేర్లు దాటేలా తరిమికొట్టాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు విద్యావంతులు, యువకులు రాజకీయ రంగంలోకి రావాలన్నారు.

ఎన్టీఆర్, నేను నిప్పులాంటి మనుషులం


ఎన్టీఆర్ తాను నిప్పులాంటి మనుషులమని నిప్పులాగానే బతుకుతానని చం ద్రబాబు అన్నారు. విష కన్య సాక్షి ప్రచురించే ఆసత్య విషయాలపై పబ్లిక్ డిబేట్‌కు రమ్మని తాను అనేకసార్లు సవాల్ విసిరినా పలాయనం చిత్తగిస్తున్నారన్నారు. సర్కారు భూములు అమ్మి అక్రమంగా గడించిన సొమ్ము తో పెట్టిన పత్రికలో విపక్షాలను, సాటి పత్రికలను సైతం బ్లాక్ మెయిల్ చేసే విధంగా వార్తలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. లక్షల కోట్లు దోచుకున్న వైఎస్సార్ పక్కన యుగపురుషుడు ఎన్టీఆర్ ఫొటో పెట్టడం ఏమిటని కార్యకర్త చంద్రబాబును ప్రశ్నించగా దొంగల పక్కన దేవుడు ఫొటో పెట్టి రాజకీయ బేరాలు సాగిస్తున్నారని వైఎస్ బతికున్నప్పుడు ఎన్టీఆర్‌ను అనేక ఇబ్బందు లు పెట్టారన్నారు. హైదరాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడితే దాన్ని తొలగించి ఘనత వైఎస్సార్‌దేనన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టేదాక విశ్రమించమన్నారు.

రౌడీల కోరలు పీకేశాం

తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో రౌడీల కోరలు పీకేశామని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేశామని చంద్రబాబు అన్నారు. మత కలహాలు లేకుండా తమ ప్రభుత్వం చట్టాలను సక్రమంగా వినియోగించిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, తమ హయాం లో మహిళల పట్ల దురాఘతాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించామన్నారు. ప్రజలు ఓటు వేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం తగదన్నారు.