March 6, 2013

గుడి వాడలో బాబుకు బ్రహ్మరథం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రకు గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పామ ర్రు, గుడివాడ నియోజకవర్గాల సరిహద్దు గాంధీ ఆశ్రమం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. పూలతో స్వాగతం పలుకుతూ హారతులు పట్టిన మహిళలు మీ పరిపాలన రావాలంటూ చేతులు ఎత్తి ఆశీర్వదించారు. రామన్నపూడిలో మహిళలు, వివిధ కుల వృత్తిదారులు పెద్ద సంఖ్యలో హాజరై బాబును స్వాగతించారు. చినఎరుకపాడు వద్ద రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరి చంద్రబాబు పాదయాత్రను తిలకించారు. ఆర్టీసీ కాలనీలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బాబుకు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు.

బాబు ప్రజానీకానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అన్న ఎన్టీఆర్ హయాంలో టీడీపీ వైభవాన్ని ప్రజలు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేశారు. రామన్నపూడి వద్ద సీనియర్ టీడీపీ నాయకులు లింగం సాయిబాబు, సూరపనేని రామచంద్రరావు పాదయాత్రలో పాల్గొన్నారు. గంగాధరపురం, బిళ్లపాడు కాలనీల మహిళలు బాబుకు మంగళ హారతులు పట్టి పూలాభిషేకం చేశారు. దారిలో స్కూ ల్ బస్సు ఎక్కిన బాబు విద్యార్థులతో ముచ్చటించారు. కూల్‌డ్రింక్ షాపులో డ్రింక్ తాగారు. వృద్ధురాలిని ఆప్యాయంగా పలుకరించి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ కూలీని పిలిచి బతుకు ఎట్టా సాగుతోందని ఆరా తీశారు. చంద్రబాబు పాదయాత్రను చూసేందుకు చిన్నారులు సైతం పొలాల వెంట పరుగులు తీస్తూ కన్పించారు. లారీలు, బస్సుల్లో వెళ్తు న్న ప్రయాణికులు సైతం బాబును చూసి కేరింతలు కొడుతూ చేతులు ఊపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తా ము ఎదుర్కొంటున్న సమస్యల చిట్టా ను ఒక మహిళ చంద్రబాబుకు అందించింది. మొత్తంమీద మంగళవారం బాబు పాదయాత్ర గుడివాడ వరకు అత్యంత ఉత్సాహంగా సాగింది.

డప్పులు, వాయిద్యాలతో కోలాహలం

పాదయాత్ర ప్రారంభం నుంచి డప్పులతోపాటు కరీంనగర్ నుంచి వచ్చిన 50 మంది వాయిద్యకారులు లయబద్ధం గా తమ డోలులపై నాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలను హుషారెత్తించారు. విచిత్ర వేషధారణతో పాదయాత్ర ముందు భాగం ఆకట్టుకుంది. గుడివాడ రూరల్ మండలం మాజీ అధ్యక్షుడు గుత్తా శివరామకృష్ణ(చం టి), నూతక్కి బాలాజీల ఆధ్వర్యంలో 60 మంది తెలుగు మహిళలు పసుపు చీరలు ధరించి బాబుకు పూలతో స్వాగ తం పలికారు. హోరెత్తిన డప్పులు, నృత్యాలతో విజయవంతం చేశారు.

పెద్ద సంఖ్యలో యువత

బాబు పాదయాత్రకు యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. గుడ్లవల్లేరు, గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు బాబు పాదయాత్రలో పాల్గొన్నారు. మరోవైపు 100 మందికి పైగా విద్యార్థులు భారీ మోటారు సైకి ళ్ళ ర్యాలీతో బాబుకు స్వాగతం పలికారు. ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ ఎంపీ గద్దె రామ్మోహనరావు,ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వరరావు, దాసరి బాలవర్ధనరావు, తంగిరాల ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, నేతలు వల్లభనేని వంశీమోహన్, కొనకళ్ళ బుల్లయ్య, లంకదాసరి ప్రసాదరావు, కాగిత వెంకట్రావ్, బొండా ఉమామహేశ్వరరావు, పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు.