March 6, 2013

బాబు బస వద్ద కోలాహాలం

చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి బస చేసిన గుడివాడ-పామర్రు హైవే సమీపంలోని గాంధీఆశ్రమం వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో కోలాహలంగా మారింది. మంగళవారం ఉదయం నుంచే జిల్లా నలుమూలల నుంచి, గుడివాడ నియోజకవర్గం నుంచి వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చారు. ఉదయం నందిగామ, విజయవాడ తూర్పు నియోజకవర్గాల సమీక్షా సమావేశం ఉండటంతో అటు నేతలు, ఇటు కార్యకర్తలు గాంధీఆశ్రమం ప్రాంతానికి ఉదయం 10గంటల కల్లా చేరుకున్నారు. అలాగే చంద్రబాబును చూసేందుకు వేలాదిమంది తరలిరావడంతో బాబు బస ఏరియా అంతా జనంతో కిక్కిరిసింది.

చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి దాదాపు 20మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి బాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సంఘీభావం ప్రకటించారు. విజయవాడకు చెందిన దేవినేని చంద్రశేఖర్, కేశినేని నాని, కాట్రగడ్డ బాబు, గుంటూరుకు చెందిన లాల్‌జాన్‌బాషా, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, బందరు నుంచి బచ్చుల అర్జునుడు తదితరులు ఉదయం నుంచే గాంధీఆశ్రమం వద్ద ఉన్నారు. కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, ఈడ్పుగంటి వెంకట్రామయ్య, నియోజకవర్గ కార్యకర్తలు వచ్చి బాబును కలిశారు. వర్ల రామయ్యతో పాటు పామర్రు నియోజకవర్గ కార్యకర్తలు, దండోరా నాయకులు బాబును కలుసుకున్నారు. నాలుగుగంటలకు బాబు పాదయాత్ర ప్రారంభం కావడంతో ఆప్రాంతమంతా ఒక్కసారిగా బోసిపోయింది.

పాదయాత్రకు తరలివచ్చిన నేతలు

దొండపాడు నుంచి మాజీ సర్పంచ్ అడుసుమిల్లి వెంకటరత్నం ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు పాదయాత్రకు తరలివచ్చారు. రామన్నపూడి మాజీ సర్పంచ్ జుజ్జవరపు వీరభద్రరావు, నూజెళ్ళ మాజీ సర్పంచ్ అట్లూరి దుర్గాభవానీ ఆధ్వర్యంలో కార్యకర్తలు పాదయాత్రకు తరలివచ్చారు. రూరల్ మండలం నుంచి వందలాది మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.