March 30, 2013

టీడీపీ ఎమ్మెల్యేల దీక్ష విరమణ


నిమ్స్‌కు వచ్చి 'దేశం' ఎమ్మెల్యేలకు
నిమ్మరసం ఇచ్చిన భువనేశ్వరి

హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై నిరవధిక దీక్ష చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం దీక్షలను విరమించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి నిమ్స్ ఆస్పత్రికి చేరుకుని ఎమ్మెల్యేలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనారోగ్యం క్షీణించిన ఎమ్మెల్యేలకు నిమ్స్ వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.

నిమ్స్ ఆస్పత్రి వద్ద ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ దీక్షల భగ్నంతో ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. మధ్యాహ్నం టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.

'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా తూ.గో జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా దీక్ష విరమించిన ఎమ్మెల్యేలను పరామర్శించారు.

విద్యుత్ సమస్యలపై నాలుగు రోజులుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న కారణంపై పోలీసులు దేశం ఎమ్మెల్యేల దీక్షను భగ్నం చేశారు. గత అర్ధరాత్రి దీక్ష శిబిరం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేలను వివిధ ఆస్పత్రుల నుంచి తెప్పించిన అంబులెన్స్‌లలో నిమ్స్‌కు తరలించారు.