March 30, 2013

నేడు మండల కేంద్రాల్లో దీక్షలు:టీడీపీ

'దేశం' దీక్ష భగ్నం!

హైదరాబాద్ : తెలుగుదేశం ప్రజా ప్రతినిధులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. కరెంటు చార్జీల పెంపు, కోతలను నిరసిస్తూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలను అర్ధరాత్రి భగ్నం చేసింది. దీక్ష నాలుగో రోజుకు చేరడం, పలువురు ఎమ్మెల్యేల ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఇక 'భగ్నం' చేయడమే మేలని భావించింది. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత దీక్ష వేదిక వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.

ఇది ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండటంతో... నిబంధనల ప్రకారం అంతకుముందే స్పీకర్ అనుమతి తీసుకున్నారు. సుమారు 150 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అటు... టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. వీరిని పక్కకు తప్పించిన పోలీసులు... దీక్షలో ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే వివిధ ఆస్పత్రుల నుంచి తెప్పించిన అంబులెన్సుల్లో వారిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ప్రభుత్వ తీరును ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నరసింహులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యపై దీక్షకు దిగిన తమను అర్ధరాత్రి వేళ అమానుషంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. "కరెంటు సమస్యపై మేం అడిగిన ప్రశ్నలకు శాసనసభలో సరైన సమాధానమే లేదు. వ్యవసాయానికి రెండు మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడంలేదు. సమస్యలు వస్తే ఫోన్ చేయండి అని సభలోనే చెప్పిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన ఫోన్లు ఆఫ్ చేసి పెట్టుకున్నారు.

ప్రజలపై వేలకోట్ల భారం మోపుతున్నారు'' అని విమర్శించారు. ఆస్పత్రిలో కూడా దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శనివారం అన్ని మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తామన్నారు. స్పీకర్ నుంచి అనుమతి రావడంలో ఆలస్యమైనందునే అర్ధరాత్రి అరెస్టు చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రజా ప్రతినిధుల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆందోళనకరంగా సత్యవతి, సీతక్క పరిస్థితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడితో సహా మొత్తం 29 మంది ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. వీరిలో 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ సీఎం రమేశ్ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నారు. వీరిలో మహిళా ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, సీతక్కల పరిస్థితి శుక్రవారం ఆందోళనకరంగా మారింది. కూర్చునే ఓపిక కూడా లేక వీరిద్దరూ పూర్తిగా పడుకొనే ఉంటున్నారు. సత్యవతి పలుమార్లు వాంతులు చేసుకొన్నారు.

పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అపోలో ఆస్పత్రికి చెందిన వైద్యులను పిలిపించి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పరీక్షించారు. వారిని ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సిఫార్సు చేశారు. కానీ, వారు శిబిరం వీడి వెళ్లడానికి నిరాకరించారు. పోలీసులు ముందు జాగ్రత్తగా ఒక అంబులెన్స్‌ను దీక్షా శిబిరం ఉన్న పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో ఉంచారు. పురుష ఎమ్మెల్యేల్లో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి. వైద్య వర్గాలు ఉదయం, సాయంత్రం దీక్షలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి నివేదిక తయారు చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు పరీక్షలకు సహకరించడం లేదని రాయాలని కోరిన ఒక పోలీసు అధికారిపై టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి విరుచుకుపడ్డారు. అందరూ సహకరిస్తుంటే అలా ఎలా రాయాలని వైద్యులకు చెబుతారని ఆమె ఆ అధికారిని నిలదీశారు. మీడియా అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆ అధికారి కోరడంపెనా ఆమె వాగ్వివాదానికి దిగారు. శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కార్యకర్తలు శిబిరం వద్దకు తరలివచ్చారు.