March 30, 2013

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్ : టీడీపీ ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఇటు పార్టీ కార్యాలయంలోను, ఎమ్మెల్యేలు దీక్ష చేస్తున్న పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా జరుపుకొన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు పార్టీ పతాకావిష్కరణ చేశారు. దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలను మొదట జయప్రకాష్ నారాయణ కూడగడితే ఆ తర్వాత ఆ పనిని ఎన్టీ రామారావు మాత్రమే చేయగలిగారని అశోక్ గజపతిరాజు ప్రశంసించారు.

టీడీపీ ప్రభుత్వం పేదవాడి కోసమే పనిచేసిందని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, వైసీపీలను తన్ని తరిమేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "జగన్ పార్టీ నేతలు ఊరికే టీడీపీపై నోరు పారేసుకోవడం కాదు. జగన్ జైలులో ఎందుకు ఉన్నాడు? ఆయన ఏమైనా ప్రజల సమస్యలపై పోరాటం చేసి జైలుకు వెళ్లాడా? జైలులో పెట్టింది ప్రభుత్వ సొమ్ము దిగమింగినందుకు కాదా? ఆ పార్టీ నేతలు ముందు దీనికి సమాధానం చెప్పాలి'' అని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.

కాగా, జానపద కళాకారులు ఎన్టీఆర్‌పై పాటలు పాడినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఉత్సాహం ఆపుకోలేక నిరాహార దీక్షా శిబిరం వేదికపై నృత్యాలు చేశారు. మోత్కుపల్లి నర్సింహులు, జైపాల్ యాదవ్, పి. రాములు, కేఎస్ రత్నం వీరిలో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు చప్పట్లతో వారిని ప్రోత్సహించారు.

మరోవైపు ఎన్టీఆర్ భవన్‌లోనూ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలలనుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలు ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందని కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. పార్టీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సహకరించిన శ్రేణులకు మరో నేత పెద్దిరెడ్డికృతఙ్ఞతలు తెలిపారు.