March 30, 2013

ఆ మాట కిరణ్,బొత్స అనగలరా?


రాఘవులు సవాల్..తులసిరెడ్డి వ్యాఖ్యలకు స్పందన

హైదరాబాద్: 'ప్రజలు ఏభై పైసలు భారం భరించలేరా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అంటున్నారు. ఆయన కరేపాకు వంటివారు. ఆయన ఏం మాట్లాడినా పట్టించుకొనేవాళ్లు లేరు. అదే మాటను చేతనైతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను అనమనండి చూద్దాం. అప్పుడు మా సమాధానమేమిటో చెబుతాం' అని సిీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు సవాల్ విసిరారు. పాత ఎ మ్మెల్యే క్వార్టర్లలోని టీడీపీ ఎమ్మెల్యేల దీక్షా శిబిరాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కూర్చోబెట్టుకొని కసరత్తు చేస్తే ఉపయోగం లేదని, విద్యుత్ నిపుణులతో చర్చించి ప్రజలపై భారం తగ్గించే మార్గాలు అన్వేషించాలని కోరారు. ప్రభుత్వం రూ.3700 కోట్ల భారం మోయాలని విద్యుత్ నియంత్రణ మండలి సూచించిందని, దానిని ప్రభుత్వం పాటించాలని డిమాండ్ చేశారు. "వంద యూనిట్లు లోపు కరెంటు వాడేవారి బిల్లులో ఏభై శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నారు. సంతోషం. ఆ పని చేయమనండి. కానీ ఆ ఖర్చు ఎస్సీ ఎస్టీ నిధుల నుంచి భరిస్తామనడం సరికాదు. ఈ రాయితీల కోసం వాటిని దారి మళ్లిస్తామంటే ఊరుకొనేది లేదు'' అని హెచ్చరించారు. విద్యుత్ చార్జీలు, కోతలకు నిరసనగా దీక్ష చే స్తున్న ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వంలో కదలిక లేదని, కాంగ్రెస్ నాయకులు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

టీడీపీ దీక్షకు నాగం సంఘీభావం: విద్యుత్ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం రాత్రి ఆయన ఎమ్మెల్యేల దీక్షా శిబిరానికి వచ్చి వారిని పరామర్శించారు. 'టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేనూ మంత్రినే. కరెంటు సమయాలను బట్టి రైతులు గడియారాలను సరిచేసుకునేంత కచ్చితంగా వేళలు పాటించాం. కాంగ్రెస్ వచ్చి ఈ వ్యవస్థను నాశనం చేసింది. టీడీపీ ఎమ్మెల్యేల దీక్ష కాంగ్రెస్ కళ్లు తెరిపిస్తుందని ఆశిస్తున్నా' అని అన్నారు.