March 30, 2013

కాంగ్రెస్,వైసీపీ దొంగల్ని తరిమికొట్టండి...

ఊసరవెల్లులు వాళ్లు!
'తూర్పు'లో చంద్రబాబు

కాకినాడ : "మా వాళ్ల జోలికి వస్తే ఊరుకోను''అని ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కొంతమంది చొక్కా మార్చినంత సులువుగా పార్టీలు మారుస్తున్నారంటూ ఇటీవల వైసీపీలోకి వెళ్లిన బొడ్డు భాస్కరరామారావును ఉద్దేశించి పరోక్షంగా మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండల కేంద్రంలో శుక్రవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. దోమాడ, కర్రకుదురు, అచ్యుతాపుర త్రయం వరకు నడక సాగించారు. అంతకుముందు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెదపూడిలో జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ జెండాను ఎగరవేసి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

"ఎన్టీఆర్ ఒక చరిత్ర. తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన కీర్తి దేదీప్యమానం. అణగారిన వర్గాలను పైకి తీసుకురావడం కోసమే ఆయన పార్టీ పెట్టారు. సమాజమే దేవాలయం...పేదలే దేవుళ్లు.. అన్న నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచిరోజులు వస్తున్నాయి. నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తల బలమే టీడీపీకి కొండంత అండ. 2014 ఎన్నికలలో మళ్లీ మనం చరిత్ర సృష్టించబోతున్నాం..'' అని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 32వ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరుపుతామని లాల్‌జాన్ బాషా తెలిపారు. కాగా, దారిలో కలిసిన మహిళలు, యువకులను పలకరిస్తూ చంద్రబాబు ముందుకు సాగారు.

ఈ సందర్భంగా జరిగిన సభల్లో జంప్‌జిలానీ నేతలను తూర్పారబట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల సంక్షేమానికి ఏటా రూ వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు వెచ్చిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగ్గంపేట, రామచంద్రపురం నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఇదిలాఉండగా, ఆరునెలల కాల వ్యవధిలో 2,500 కిలోమీటర్లకు పైగా నడిచిన చంద్రబాబు..బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. 'రికార్డ్సు' ప్రతినిధులు శుక్రవారం ఆయనకు 'ఏకవీర' బిరుదు ఇచ్చి సత్కరించారు.

పర్చూరు ఇన్‌చార్జి సాంబశివరావు : టీడీపీ హైదరాబాద్: ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరావని తెలుగుదేశం పార్టీ మీడియా విభాగం ఇన్‌చార్జి ఎల్‌వీఎస్ఆర్‌కె ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బాగా పనిచేస్తున్నారంటూ పర్చూరు ఇన్‌ఛార్జిగా గోపాలకృష్ణ అనే పేరు ఆయన చెప్పారని మీడియాలో పొరపాటుగా వచ్చిందని, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి సాంబశివరావని ప్రసాద్ వివరణలో పేర్కొన్నారు.