March 31, 2013

వైఎస్ పాపాల వల్లే మనకీ 'షాక్‌లు'

గాలికీ పన్నేస్తారేమో!
సీఎం ఆరిపోయిన అవినీతి కిరణం
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తాం: చంద్రబాబు



కాకినాడ, మార్చి 30 : "ఇదో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. మనం పీల్చుకునే గాలికి కూడా పన్ను వేసేలా ఉంది'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌లోని కొవ్వాడలో శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. గంగన్నపల్లి, చీడిగ, ఇంద్రపాలెం మీదుగా నడక సాగించారు. ఈస్టర్‌ను పురస్కరించుకొని చీడిగలో జరిగిన క్రైస్తవ సదస్సులో పాల్గొన్నారు. "పేదల సొమ్ము దోచుకోవడం పాపమని బైబిల్ చెప్పింది. వైఎస్ కుటుంబం మాత్రం మతాన్ని అడ్డంపెట్టుకుని దోపిడీకి పాల్పడింది'' అని ఆక్షేపించారు.

అధికారంలోకి వస్తే క్రైస్తవ దళితులకు ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని క్రైస్తవ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు.. విద్యుత్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కొవ్వాడ సభలో తీవ్రంగా గర్హించారు. " వైఎస్, కాంగ్రెస్ దొంగలు కమీషన్లకు ఆశపడి ప్రైవేటు విద్యుత్ కంపెనీల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొన్నారు. ఇప్పుడా భారాన్నంతా సర్‌చార్జీల రూపంలో పేదలపై వేస్తున్నార''ని విమర్శించారు. సీఎం యువ కిరణం కాదు..ఆరిపోయిన అవినీతి కిరణం అని, ఆయన పాలన ప్రజల పాలిట శాపమని తూర్పారబట్టారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన ఘనత వైఎస్‌దేనని దుయ్యబట్టారు.

"రాజశేఖరరెడ్డి ఓ మేకవన్నె పులి. ఎమ్మెల్యేలను పాడుచేశారు. అధికారులను జైలుకు పంపారు. బతికుండగా వైఎస్ ప్రతిసారీ విశ్వసనీయత గురించి మాట్లాడేవారు. విశ్వసనీయత అంటే దోచుకోవడమా?' అన్నారు. ఆయన హ యాంలో టీడీపీ కార్యకర్తలు 200 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. చివరకు వైఎస్ పత్రికల్నీ వదిలిపెట్టలేదని, కొడుకు పత్రిక, టీవీ కోసం ఇతర పత్రికల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. తాత రాజారెడ్డి హత్యా రాజకీయ వారసత్వాన్ని జగన్ పుణికిపుచ్చుకున్నారని ధ్వజమెత్తారు. "జగన్ నన్నూ బెదిరించారు.

'మీ నాన్నే నన్నేమీ చేయలేకపోయాడు. నువ్వేం చేస్తావ్' అని అడిగాను'' అని చెప్పుకొన్నారు. కాగా, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు ఎన్ని కుయుక్తులు పన్నినా అంతిమ విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రకు ముందుగా కొవ్వాడలో పెద్దాపురం నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1984 సంక్షోభాన్ని గుర్తు చేశారు. "కొంతమందికి కొన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి. 1984 ఆగస్టు సంక్షోభం గురించి నా మనసు ఎందుకో శంకించింది. నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తున్నారని ముందే అనిపించింది. సంకల్పాన్ని బట్టి బుద్ధి పనిచేస్తుంది'' అని చెప్పుకొచ్చారు.

గతంలో పెళ్లి చేయాలంటే రెండు తరాలు చూసేవారని, అభ్యర్థుల్ని ఎంపిక చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడు తరాలు చూడాలేమోనని చమత్కరించారు. ఈ సమయంలో జిలానీ అనే కార్యకర్త వైఎస్ సమాధి అంశం లేవనెత్తడంతో చర్చ ఆసక్తిదాయకంగా మారింది. "సార్! ఇడుపులపాయలో రాజశేఖరరెడ్డి సమాధి చాలా పెద్దదిగా కట్టారు. చుట్టూ కరెంటు పెట్టారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ సమాధులు కూడా ఇంత పెద్దగా లేవు. అసలు ఆ సమాధిలో వైఎస్ శవం ఉందో.. మరేముందో?' అని అనగా "బంగారం దాచిపెట్టారేమో?'' అని చంద్రబాబు సరదాగా అన్నారు.