March 31, 2013

చార్జీలపై సమరమే: టీడీపీ

హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కదనరంగంలోకి దూ కింది. సర్కారుపై సమరం ప్రకటించింది. విద్యుత్తు చార్జీలను తగ్గించేంతవరకు పోరాడతామని ఆ పార్టీ నేతలు దేవేందర్ గౌడ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, పరిటాల సునీత, సండ్ర వెంకటవీరయ్య, శమంతకమణి ప్రకటించారు. ధర్నాలు, నిరసనలు, బంద్‌లతో ప్రభుత్వం మెడలు వంచుతామని వారు హెచ్చరించారు.

కొత్త విద్యుత్తు ధరల ప్రతులను టీడీఎల్పీ కార్యాలయం వద్ద దహనం చేశారు. ఏప్రిల్ 2 నుంచి 7 వ తేదీ వరకు గ్రామాల్లో సంతకాల సేకరణను నిర్వహిస్తామని నేతలు వెల్లడించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రం చీకటిమయమైందని, రోశయ్య, కిరణ్ అదే పరిస్థితిని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇంత అడ్డగోలుగా చార్జీలు పెంచలేదని ముద్దుకృష్ణమనాయుడు ధ్వజమెత్తారు.

కాగా, తెలుగు మహిళలు సోమవారం నిరాహార దీక్షకు సిద్ధమవు తున్నారు. తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ వద్ద పలువురు మహిళా నేతలు, కార్యకర్తలు దీక్షలో పాల్గొంటారని ఆ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రతి పక్షాల పిలుపు మేరకు వచ్చేనెల తొమ్మిదో తేదీన జరగనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పీఎల్ శ్రీనివాస్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.