March 31, 2013

బాబు దీక్ష నిరాహారంగా ఒకరోజు నిరసన


పాదయాత్రగా కాకినాడ సబ్‌స్టేషన్ వద్దకు
సాయంత్రం వరకు రోడ్డుపై బైఠాయింపు
'విద్యుత్' ఉద్యమానికి ఊపు తెచ్చే యత్నం

కాకినాడ : పాదయాత్ర.. పోరుయాత్రగా మారనుంది. ఇప్పటిదాకా జనంలోకి నడిచిన పాదాలు సర్కారుపై కదం తొక్కనున్నాయి. సమస్యలు వింటూ ముందుకు సాగిన ప్రయాణం.. నిలబడి కలబడే రణంలోకి మళ్లనుంది. వాతలు పెడుతున్న కోతలు, వీపు వాయగొడుతున్న చార్జీల మోతలకు వ్యతిరేకంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ఒక రోజు దీక్షకు సిద్ధమవుతున్నారు. గ్యాస్‌బండ నుంచి వంటింటి సరుకుల దాకా కొండెక్కి కూర్చున్న వేళ సామాన్యుడిపై ఆరు వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపడంపై ఆయన నిరాహారంగా నిరసన తెలపనున్నారు. కోతలతో మూతపడుతున్న పరిశ్రమలు; సాగర్ నీళ్లూ, మోటార్ నీళ్లూ లేక నోళ్లు వెళ్లబెడుతున్న పంట పొలాల పరిస్థితిపై ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు సన్నద్ధమవుతున్నారు.

పాదయాత్రకు ఆదివారం విరామం కావడంతో ఆయన ఆనందభారతి గ్రౌండ్స్‌లో బస చేశారు. సోమవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో తన బస నుంచి ఆయన పాదయాత్రగా బయలుదేరతారు. అక్కడకు 2.7 కిలోమీటర్ల దూరంలోని కాకినాడ జేఎన్‌టీయూ వద్ద గల నాగమల్లితోట సబ్‌స్టేషన్ వద్దకు 11 గంటలకు చేరుకుంటారు. విద్యుత్ చార్జీల పెంపు-కోతలకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయిస్తారు. సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష చేసి.. ఆ తర్వాత పాదయాత్రను కొనసాగిస్తారు.

విద్యుత్ సమస్యపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్రమంతటా ఉద్యమాన్ని రాజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరగనున్న చంద్రబాబు దీక్ష.. కరెంటు ఉద్యమానికి మరింత ఊపునిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి.. చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ప్రకటన చేసిన సమయంలో బాబు పాదయాత్రలో ఉన్నారని.. ఆ క్షణానే 'దీక్ష'కు నిర్ణయం తీసుకున్నారని ఈ వర్గాలు చెబుతున్నాయి.

బాబును కలిసిన కుటుంబ సభ్యులు
పాదయాత్రకు ఒకరోజు విరామం ఇచ్చి బసలో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబును ఆదివారం ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి కలిశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు వారు చంద్రబాబుతో గడిపారు. అంతకుముందు..లోకేశ్, బ్రాహ్మణిలు హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో వచ్చారు. చంద్రబాబు కుటుంబానికి సన్నిహితులైన కొందరు లోకేశ్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరులు ఆయనను కలవగా మాట్లాడేందుకు నిరాకరించారు. అనంతరం కారులో చంద్రబాబు వద్దకు వెళ్లారు.