March 31, 2013

చీకటి చింతల్లో పల్లెలు!

కొవ్వొత్తులు ఆత్మశాంతికి ప్రతీకలు. గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖాన్ని కొవ్వొత్తి వెలుగు కొంతైనా తగ్గించి ఓదారుస్తుంది. కానీ, ఈ పల్లెల ఆవేదన తీరాలంటే, ఎన్ని కొవ్వొత్తులు వెలిగించాలో! ఈ చీకటి చింత తొలగాలంటే ఎంత వెలుగు ప్రసరించాలో! చీకట్లోనే కాకినాడలో అడుగుపెట్టాను.



ఆడపడుచులకు విలువనిచ్చిన పార్టీ, ప్రభుత్వం మాది. ఇప్పుడు వాళ్లు అన్నివిధాల చీకట్లోనే మగ్గుతున్నారు. రూపాయిని పొదుపు చేయడం నేర్పి వారిని మహాలక్ష్ములను చేద్దామని నాడు నేను చూస్తే, లక్షాధికారులను చేస్తామంటూ ఆ పెద్ద మనిషి వాళ్లను భిక్షాధికారులను చేసి పోయాడు. ఇంద్రపాలెంలో జరిగిన ఆత్మీయ సమా వేశంలో మహిళల గోడు ఇదే. డ్వాక్రా మహిళలుగా..ఇప్పుడు ఆర్థిక లబ్ధినే కాదు,

కనీసం ఆత్మగౌరవాన్ని కూడా నిలుపుకోలేకపోతున్నామని వాపోయారు. ఆడపిల్ల మైనస్ కాదు, ప్లస్ అని చాటాలన్న తాపత్రయం వారి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకునేలా చేసింది. కానీ, ఇప్పుడు ఆ కార్యక్రమాలూ లేవు.. ఆ కళా లేదు. చాలీచాలని కూలీ, మొగుడి తాగుడు కోసం తాకట్టుకు పోయే తాళి.. గ్యాస్‌బండ నుంచి ధరలకొండ వరకు వాళ్ల జీవితమే ఒక ఎగతాళి..!
ఎప్పుడో పోయిందో తెలియదు.. ఏ గడపలో చూసినా కొవ్వొత్తులూ..కిరోసిన్ బుడ్లే! దుకాణాల్లోనూ వాటి వెలుగులోనే బేరాలు చేస్తున్నారు. ఉక్కపోసి గుక్కపెట్టిన చిన్నారులను భుజాన వేసుకొని ఆడపడుచులు వాకిట కునికిపాట్లు పడుతున్నారు. సందడిగా ఉండాల్సిన వీధులు రాత్రి తొమ్మిదయ్యేసరికి దుప్పటి తన్నేసినట్టు నిర్మానుష్యంగా కనిపించాయి. ఏ ఇంట్లోనూ మగమనిషి లేడు. అడిగితే.. మోటార్ వేయడానికి పొలం పోయాడనేదే జవాబు! ఈ పాపం ఎవరిది?