February 22, 2013

సంక్షేమం అడ్రస్ ఏదీ?

హైదరాబాద్ బాంబు పేలుడు విషయం తెలియగానే మనసు మనసులో లేదు. యాత్రను ఒక పూట వాయిదా వేసుకొని పరామర్శకు బయలుదేరాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పలకరించినప్పుడు.. వారి మోములో ఆవేదనతో పాటు ఆగ్రహమూ కనిపించింది. ఆ కోపం సర్కారుపైనేనని వాళ్ల మాటలను బట్టి తెలిసింది. ఒకే ప్రాంతంలో పదేపదే పేలుళ్లు జరుపుతుంటే హైదరాబాద్‌లోనూ, ఢిల్లీలోనూ ఉన్న ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయన్న ప్రశ్న ఆ వాడి కళ్లలో కనిపించింది. "ఎవరి పాపం..ఎవరికి శిక్ష?'' అని ఆక్రోశించారు.

నిజమే.. ఉగ్రవాదంతో గానీ, ఆ సమస్యకు ఆజ్యం పోసే ప్రభుత్వ విధానాలతో గానీ వీళ్లకేం సంబంధం? వీళ్లంతా బడుగులు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పని చేసుకొని ఏ రాత్రికో ఇంటికి చేరుకొనే సామాన్య జనం. ఆఫీస్‌లకు వెళ్లి వచ్చే మధ్యతరగతి మనుషులు. బజారుకు వచ్చిన మనిషి తిరిగి ఇంటికి చేరకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏదో పని వెతుక్కొని ఊరికొస్తాడనుకున్న కొడుకు విగతజీవిలా వస్తే ఆ తల్లి పడే క్షోభను ఏ ప్రభుత్వ ప్రకటన ఓదార్చగలదు?

దోనేపూడి గ్రామంలో నడుస్తున్నప్పుడు..ఆస్పత్రుల్లో కనిపించిన జనాలే కదా వీళ్లంతా అనిపించింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఎంత బూటకమో.. ఈ గ్రామాల్లో సంక్షేమం అంత నాటకం. కాకపోతే, కదం తొక్కుదామంటే..ఆ రోజు కూలీ పోయి పిల్లలు పస్తు పడుండాల్సి వస్తుందని పేదల భయం. రోడ్డెక్కుదామంటే మధ్యతరగతికి మర్యాదే పెద్ద అడ్డంకి. ఇళ్లు లేదంటూ నన్ను కలిసినవారిలో వారూవీరూ ఉన్నారు. ఇక సంక్షేమం అడ్రస్ ఎక్కడ?