February 22, 2013

బాబు యాత్రకు అపూర్వ ఆదరణ

అదే ఉత్సాహం, అదే పట్టుదల, సడలని ఆత్మ విశ్వాసం... 48 గంటల విరామం అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం 5.15లకు పాదయాత్రను పునఃప్రారంభించారు. దారి పొడవున జయ,జయ థ్వానాలతో కార్యకర్తలు స్వాగతం పలుకుతూ ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు. వేమూరులోని విశ్వచైతన్య పబ్లిక్ స్కూలు విద్యార్ధులు స్వాగతం పలుకుతూ ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు.

మొసలిపాడు, క్రాప, అనంతవరం తదితర ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ఉద్వేగ భరిత ప్రసంగం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుడు మరోసారి రుజువుచేసిందని ఆయన ధ్రిగ్భాంతి వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను గాలికొదిలిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

యువతలో ఉత్సాహం నింపుతూ... చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఆద్యంతం యువతలో ఉత్సాహం నింపేవిధంగా సాగింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కిరికిరి కిరణ్‌కుమార్ రెడ్డి అంటూ ఎద్దేవా చేస్తూ ప్రసంగించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ కావని విమర్శించారు. మహిళలు, వృద్దులు, వికలాంగులు ఎవరికీ కూడా ఈ ప్రభుత్వంలో సుఖశాంతులు లేవని ఆవేదన చెందారు. వ్యవసాయం కుంటుపడటం, దేశానికి మంచిది కాదన్నారు. రైతుల పేరుతో అప్పులు తీసుకొని వారిని నట్టేట ముం చుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలోని అం దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని, దీనికి అంతూ పొంతూ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సన్నబియ్యం రూ.50కు చేరిందని, తెదేపా అధికారంలో ఉన్నప్పుడు రూ.15లకే సన్నబియ్యం అందించామని గుర్తుచేశారు. ఇలా అన్ని వర్గాలను దోచుకుంటూ కాంగ్రెస్ దొంగలు ర్రాష్టాన్ని దివాలా తీస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.పిట్టకథలతో ఆకట్టుకున్న బాబు... తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అనంతవరం, ముసలిపాడు, క్రాప క్రాస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో పిట్టకథలు చెప్తూ ప్రజలను ఉత్తేజపరిచారు. ఒక పేదవాడు రాజు వద్దకు వెళ్లి నాకు భూమి కావాలని అడిగాడు. ఉత్సాహంతోఉన్న ఆ రాజు పేదవానితో నీవు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంతదూరం పరిగెత్తితే అంతదూరం నీకే చెందుతుందని చెప్పాడు.

అత్యాశతో ఉన్న ఆ పేదవాడు కొద్ది దూరం మామూలుగానే పరిగెత్తి అనంతరం వేగం పెంచాడు. కనీసం నీరు, ఆహారం తీసుకోకుండా సూర్యాస్తమయం వరకు పరిగెత్తి, పరిగెత్తి గుండెపోటుతో మరిణించాడు. ఇలా అత్యాశకు పోయిన ఆ వ్యక్తి దుస్థితే కాంగ్రెస్ నేతలకు పట్టిందని, వేల కోట్లు దోచుకొని చంచల గూడ జైలులో ఊసలు లెక్కపెడుతున్నాడని బాబు తనదైన శైలిలో పిట్టకథలు చెప్తూ కాంగ్రెస్ అవినీతి, అక్రమాలను ఎండగట్టాడు.