February 22, 2013

జీవితానికి భరోసా కావాలి

పాదయాత్ర క్రాప క్రాస్‌లో ఉన్నప్పుడు విన్న వార్తతో నిశ్చేష్టుడినయ్యాను. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల విషయం తెలిసింది. ఆ దుర్ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ప్రజలకు రక్షణ, స్వేచ్ఛగా జీవించేందుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అక్కడి నుంచి ముసలిపాడు వద్దకి చేరేసరికి అక్కడి రైతులు తమ కష్టాలను ఏకరవుపెట్టారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అన్నదాతలవి ఒకే రకమైన కష్టాలు. ఇది పేరుకు కోస్తా ప్రాంతమే అయినా రైతుల సమస్యలకు మాత్రం కొదువ లేదు.

'వరి పంటకు నీరివ్వలేమని చెప్పడంతో మొక్క జొన్న వేసుకుందామని చూశాం. తక్కువ నీటితోనే పంట చేతికొచ్చే అవకాశం ఉన్నా దానికీ నీరివ్వలేమని అధికారులు చేతులెత్తేశారు. పోనీ బోరుపై ఆధారపడదామంటే కరెంట్ రాదు. ఇక ఎలా సాగు చేసేది? జీవితం ఎలా సాగించేది?' అంటూ అన్నదాతలు చె ప్పిన మాటలు నా మనసును కదిలించాయి. మీరు అధికారంలోకి వస్తే పగటిపూటే 9గంటలు కరెంట్ వచ్చేలా చూడండి సార్! అంటూ వాళ్లు వేడుకుంటున్నారు.

కుప్ప కూలిపోయిన వ్యవస్థలను రాత్రికి రాత్రే మంత్రం వేసినట్టు బాగు చేయలేం. కానీ కష్టపడతా.. వారి కోరిక నెరవేర్చేందుకు రాత్రింబగళ్లు పనిచేస్తానని మాత్రం హామీ ఇచ్చాను. కొల్లూరు పొలిమేరల్లో యానాదిపాలెం చేరుకోగానే దారి పొడవునా పెద్ద ఎత్తున ఆడపడుచులు బారులు తీరి కనిపించారు. వారివి రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలే. అభిమానంతో నన్ను చూడాలని రోడ్లెక్కారు. తమ జీవితాలు దుర్భరంగా ఉన్నాయని నోరు తెరచి చెప్పకపోయినా వారి ముఖాలు చూస్తుంటేనే పరిస్థితి అర్థమవుతోంది. ఇలాంటి వారి జీవితాలు మార్చాలన్న సంకల్పంతోనే నేను ఈ పోరాటం చేస్తున్నాను.