February 22, 2013

మలి సంధ్య వేళ.. వస్తున్నా... మీకోసం

ఎన్నికల నియమావళితో 48 గంటల విశ్రాంతికి పరిమితమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మలిసంధ్య వేళలో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసే నేటి (గురువారం) సాయంత్రం ఐదు గంటలకు తన పాదయాత్రను వేమూరు నుంచి పునఃప్రారంభించనున్నారు. కోడ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పటివరకు రోజుకు 10 కిలోమీటర్ల లోపే నడక సాగిస్తోన్న ఆయన ఇకపై ఎక్కువ దూరం పాదయాత్ర చేయాలని నిర్ణయించుకొన్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఏకంగా 9 కిలోమీటర్లు నడిచి దోనెపూడిలో రాత్రికి బస చేయన్నుట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వేమూరు రైల్వేగేటు దాటిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో విశ్రాంతి తీసుకొంటున్న ఆయన నేడు మొసలిపాడు, క్రాప అడ్డరోడ్డు, కొల్లూరు మీదుగా దోనెపూడి వరకు నడక సాగిస్తారు. ఈ నేపథ్యంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నేతృత్వంలో ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

నాయకులకూ... విశ్రాంతి

చంద్రబాబు పాదయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బుధవారం పూర్తిగా విశ్రాంతి తీసుకొన్నారు. 15 రోజుల నుంచి ఆయన వెంటే నడక సాగిస్తోన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీ వీ ఆంజనేయులుతో పాటు ఇతర నాయకులు తమ నియోజకవర్గాల్లోనే విశ్రాంతి తీసుకొన్నారు. స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకొని పాదయాత్రకు లభిస్తోన్న స్పందనపై చర్చించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావుతో పాటు మరి కొంతమంది నాయకులు మంగళవారం డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.

పాదయాత్ర కొనసాగే ప్రాంతాలు..

గురువారం రాత్రికి చంద్రబాబు దోనెపూడికి చేరుకొని అక్కడ బస చేసిన అనంతరం 22వ తేదీన ఉదయం అక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభిస్తారు. కోటిపల్లి, వెల్లటూరు, భట్టిప్రోలు, వేమవరం, సూరేపల్లి, కోనేటిపురం మీదుగా పల్లెకోన చేరుకొన్న అనంతరం వేమూరు నియోజకవర్గ పర్యటన పూర్తి అవుతుంది. ఆ తర్వాత రేపల్లె నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. కారుమూరు, లంక అడ్డరోడ్డు, వరికూటివారిపాలెం క్రాస్, పేటేరు, బేతపూడి, ఇసుకపల్లి సెంటర్, పాతపట్టణం - అరవపల్లి రోడ్డు, అవరపల్లి, ఊళ్లపాలెం, నల్లూరుపాలెం, సింగుపాలెం అడ్డరోడ్డు, సింగుపాలెం, విశ్వేశ్వరం, బొబ్బర్లంక, మైనేనివారిపాలెం, చాట్రగడ్డ స్కూల్, చాట్రగడ్డ, రుద్రవరం, పెనుమూడి, పెనుమూడి వారధి మీదుగా కృష్ణాజిల్లాలోకి షెడ్యూల్‌ను రూపొందించారు. తొలుత ఈ నెల 27వ తేదీ వరకు పాదయాత్రను కొనసాగించాలని నాయకులు భావించారు. ఎన్నికల కోడ్ గురువారంతో ముగుస్తున్న నేపథ్యంలో రోజుకు 12 నుంచి 13 కిలోమీటర్లకు పాదయాత్ర షెడ్యూల్‌ను సవరించి 26వ తేదీ రాత్రికి పెనుమూడి వారధి దాటేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. దీనిపై పుల్లారావు ఆదేశాల మేరకు మన్నవ సుబ్బారావు తదితరులు బుధవారం మధ్యాహ్నం రేపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ అనగాని సత్యప్రసాద్‌తో ఫోన్‌లో చర్చించారు.