February 22, 2013

జన ఉప్పెన

చంద్రబాబు పాదయాత్ర జిల్లాలోని వేమూరు నుంచి గురువారం సాయంత్రం పునఃప్రారంభమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో 48 గంటల విరామం అనంతరం చంద్రబాబు సాయంత్రం 5 గంటల సమయంలో బస్సు దిగగానే వందలాది మంది కార్యకర్తలు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. వేమూరు పరిసర ప్రాంతాల నుంచి మహిళలు, విద్యార్థినులు, యువకులు వచ్చి చంద్రబాబుతో సంభాషించి ఆయన వెంట అడుగేశారు. వేమూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ముసలిపాడు వద్దకు చేరుకోగానే స్థానికులు ఎదురువెళ్ళి చంద్రబాబుకు తమ సమస్యలు వివరించారు. సాగునీరు, విద్యుత్ సమస్యలతో వేగలేకపోతున్నామని, తమ కష్టాలు తీరాలంటే మీరు అధికారంలోకి రావాలని చంద్రబాబును కోరారు.

ముసలిపాడులో ప్రసంగించిన అనంతరం క్రాప అడ్డరోడ్డు వద్ద స్థానిక ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. కొల్లూరు శివారుకు చేరుకునే సరికి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ వేలాది మంది కార్యకర్తలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. కనకతప్పెట్లు, విచిత్ర వేషధారణలు, బాణాసంచ పేలుళ్ల మధ్య కొల్లూరులో చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. రోడ్డుకిరువైపులా కాన్వాయ్ వెంట వేలాది మంది ప్రజలు కదంతొక్కారు. మేడల మీద నుంచి చంద్రబాబుకు అభివాదం చేస్తూ పరవశించిపోయారు. చంద్రబాబు రాక నేపథ్యంలో కొల్లూరు అంతటా భారీ ఫ్లెక్సీలు, తోరణాలతో పసుపు పరవళ్లు తొక్కించారు. కొల్లూరులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తూ మీరు చూపించిన అభిమానం జీవితంలో మరిచిపోలేనిదని అన్నారు.

హైదరాబాద్ సంఘటన నేపథ్యంలో ప్రసంగించాలా వద్దా అని సంశయించారు. ఆ తర్వాత సమస్యలపై చర్చించుకుందామని ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే గంటల తరబడి వేచి వున్న ప్రజలను చూసి కొద్దిసేపు ఉపన్యసించారు. 1994లో రాష్ట్ర ఆదాయం 8 వేల కోట్లు ఉంటే తాను చేసిన సంస్కరణల కారణంగా రూ.లక్షా 50 వేల కోట్లకు చేరుకుందని, ఆ డబ్బులు కాంగ్రెస్ దొంగలు దోచుకోటానికే సరిపోతుందని ధ్వజమెత్తారు. పేదల అభివృద్ధి, సంక్షేమం చూడాల్సిన వారు జలయజ్ఞం పేరుతో 30 వేల కోట్లు దోచారని ఆరోపించారు. పల్లెల్లో ఏ పనులు జరిగినా కాంగ్రెస్ దొంగలే బిల్లులు చేసుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతిని సమాజంలో సర్వ సాధారణం చేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు.

కరువు, ప్రకృతి విపత్తులు వచ్చిన సందర్భాల్లో రైతులకు పంట పెట్టుబడులపై భరోసా ఇవ్వమని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిందని, అయితే దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కింది. మేము అధికారంలోకి వస్తే వ్యవసాయం లాభసాటి చేసే వరకు రైతులకు అండగా ఉంటానని చంద్రబాబు వాగ్ధానం చేశారు. గ్రామాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇచ్చితీరుతానన్నారు. 'రైతులు ఎదుర్కొంటున్న కష్టలు చూస్తుంటే ఆవేదన, ఆగ్రహం, ఆవేశం వస్తుందని, అదే సమయంలో సభ్యత అడ్డువస్తుందన్నారు.

ఏప్రిల్ ఒకటి నుంచి కరెంటు బాంబు వైఎస్ చనిపోకముందు చేసిన అప్పుల కారణంగా ఏప్రిల్ ఒకటి నుంచి ప్రజలపై మరో కరెంటు బాంబు పడబోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సర్‌చార్జ్‌పై విచారణ చేస్తున్నారని, ఏప్రిల్ ఒకటి నుంచి రూ.13 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపబోతున్నారని చెప్పారు. ఇదే విధంగా మరో మూడు వేల కోట్లు బాధితులపై కోర్టుల్లో విచారణ జరుగుతుందన్నారు. ఈ విధంగా మొత్తం రూ.32 వేల కోట్ల భారాన్ని ఒక్క విద్యుత్ చార్జీల రూపంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పలుచోట్ల ప్రసంగించిన అనంతరం చంద్రబాబు దోనెపూడికి చేరుకుని రాత్రికి బస చేశారు.

చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్, టీడీపీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, వేములపల్లి శ్రీరాంప్రసాద్, కోవెలమూడి రవీంద్ర, ముత్తినేని రాజేష్, రమాశాంతాదేవి, మానుకొండ శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు చీరాల గోవర్ధనరెడ్డి, ముమ్మనేని వెంకట సుబ్బయ్య, చిట్