February 22, 2013

ప్రజలు సయంమనం పాటించాలి : చంద్రబాబు

పేలుళ్ల ఘటన దురదృష్టకరం
ప్రభుత్వ వైఫల్యమే కారణం

నగరంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, ఉగ్రవాదులు పక్కా పథకం ప్రకారమే పేలుళ్లకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం దారుణమని అన్నారు. పేలుళ్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు.

శుక్రవారం ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌లోని బాంబు పేలుళ్ల ఘటనాస్థలిని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా ప్రభుత్వం ముందే హెచ్చరించింది, కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది. ఇన్ని హెచ్చరికలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వ తేలిగ్గా తీసుకోవడం బాధాకరమన్నారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ప్రజలు సంయమన ం పాటించాలని చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు.

దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలియగానే చంద్రబాబు తమ పాదయాత్రను వాయిదా వేసి, శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఇకనైనా అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.