February 22, 2013

సీఎంది బాధ్యతా రాహిత్యం

ప్రభుత్వానిది ఘోర వైఫల్యం: బాబు..
బాధితులకు పరామర్శ...
అనంతరం యాత్ర కొనసాగింపు

"బాంబు పేలుళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది ఘోర వైఫల్యం. సీఎంది బాధ్యతా రాహి త్యం. కేంద్రం సమాచారం పంపినా జాగ్రత్తలు తీసుకోలేకపోయారు'' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. శుక్రవారం పాదయాత్రను ఒకపూట వాయిదా వేసుకొని హైదరాబాద్‌కు వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, పేలుళ్లపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఒక పట్టు పట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. అనంతరం ఆయన గుంటూరు జిల్లాకు వచ్చి పాదయాత్రను కొనసాగించారు. వేమూరు నియోజకవర్గంలోని దోనెపూ డి, కోటిపల్లి, వెల్లటూరులో పర్యటించిన ఆయన.. మళ్లీ అధికారంలోకి వస్తే వాటితో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు.

మరోవైపు, కాంగ్రెస్ అసమర్థ పాలనతో హైదరాబాద్ తీవ్రవాదుల స్వర్గధామంగా మారిందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజి దెబ్బతిందని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, పేలుళ్లుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమంటూ టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్ పార్లమెంటు ఉభయ సభల్లో గట్టిగా నిరసన తెలిపారు.

ఇంటికి వెళ్లని చంద్రబాబు
బాంబు పేలుడు ఘటన బాధితులను పరామర్శించడం కోసం తన పాదయాత్రకు విరామం ఇచ్చిమరీ హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబు... అటు నుంచి అటే వెళ్ళిపోయారు. ఇంత దూరం వచ్చీ ఇంటికి వెళ్లకుండానే తిరుగుముఖం పట్టడం గమనార్హం. పాదయాత్ర పూర్తయిన తర్వాతే ఇంటికి తిరిగి రావాలని నియమం పెట్టుకొన్న చంద్రబాబు.. బాధితులను పరామర్శించిన అనంతరం నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడే పార్టీ నేతలతో మాట్లాడి.. విజయవాడ వెళ్లారు.