February 22, 2013

ప్రజలకు రక్షణేది?

యథేచ్ఛగా ప్రాణాలు బలిగొంటున్నారు
హైదరాబాద్ పేలుళ్లని ఖండిస్తున్నా
గుంటూరు పాదయాత్రలో చంద్రబాబు

రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో 48 గంటల పాటు పాదయాత్రకు విరామం ఇచ్చిన ఆయన గురువారం సాయంత్రం గుంటూరు జిల్లా వేమూరు నుంచి తన యాత్రను పునఃప్రారంభించారు. ముసలిపాడు, క్రాప అడ్డరోడ్డు, కొల్లూరు మీదుగా దోనేపూడి వరకు 8 కిలో మీటర్లు నడిచారు. ఈ సందర్భంగా పలు చోట్ల ప్రసంగించారు. యాత్ర రావికంపాడుకు చేరుకున్న సమయంలో హైదరాబాద్‌లో బాంబు పేలుడు ఘటన తెలుసుకున్న చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ హయాంలో శాంతి భద్రతలను పరిరక్షించామని, తీవ్రవాదులు, రౌడీలు గడగడలాడిపోయేవారని.. నేడు వారు యథేచ్ఛగా ప్రజల్లోకి వచ్చి ప్రాణాలను బలిగొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగాల్లో వైఎస్ జగన్ అవినీతిని కూడా ఎండగట్టారు. 'జగన్ రూ. 43వేల కోట్లు దోచాడని సీబీఐ నిర్ధారించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల జగన్ ఆస్తులను జప్తు చేయడాన్ని న్యాయస్థానం సమర్థించింది. జగన్ దోపిడీని కోర్టులు కూడా నమ్మి బెయిల్ ఇవ్వకుండా స్పష్టమైన వైఖరితో ఉన్నాయి. తాము తప్పు చేయలేదని బుకాయిస్తున్న పిల్ల కాంగ్రెస్ నాయకులు ఈడీ, న్యాయస్థానం తీసుకుంటున్న చర్యలపై ఏం సమాధానం చెబుతారు' అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

యువతకు ఉద్యోగాలేవి?: 'ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులకు నేడు ఉద్యోగాలు లేవు. దీనికి కారణం కాంగ్రెస్ అవినీతి పాలనే. రాష్ట్రంలో విద్యుత్ లేకుండా చేశారు. దీని వలన కొత్త పరిశ్రమలు రాక ఉపాధి కరువైంది. పెట్టుబడిదారులు చంచల్‌గూడా జైలులో ఉన్నారు. ఐదేళ్ల తరువాత విద్యార్థులు కూడా తమ చదువును మరిచిపోయి తల్లిదండ్రులకు భారంగా పరిణమించే ప్రమాదం ఉంది' అని ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును అంధకారం చేసిన పాపం వైఎస్‌దేనని మండిపడ్డారు. పరిపాలనపై అనుభవం లేకుండా సీఎం కిరణ్ ర్రాష్టాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. 'కిరణ్‌కు వ్యవసాయం, నీటి యాజమాన్యం గురించి తెలియదు. రైతులకు సాగునీరు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. కిరణ్ ఓ జాక్‌పాట్ సీఎం' అని ఎద్దేవా చేశారు.

అకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల వల్ల కలిగే నష్టాలకు రైతులకు ఎకరానికి రూ. 10వేల పరిహారం ఇవ్వాలని తాను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నానని, ఇప్పుడు సీఎం కూడా అదే మాట చెబుతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలు పడి వారం గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారిని కూడా క్షేత్రస్థాయికి పంపించి నష్టాన్ని అంచనా వేయించలేదని విమర్శించారు. నీలం తుఫాను వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నష్టపరిహారం ఇప్పించలేకపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరువు, ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నా, పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, రాష్ట్రం గాలివాటంగా ముందుకు సాగిపోతుందే తప్ప ప్రజలకు సుఖం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.