February 11, 2013

ఐక్యతే కీలకం

'జిల్లాలో క్యాడర్ పట్టుదలతో కసిగా ఉంది. నాయకుల ఐక్యతే ఇప్పుడు ముఖ్యం. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు బేషజాలు వీడి సమష్టిగా పని చేయాల్సిన కీలక తరుణమిదేనని' తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్రలో భాగంగా గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో బస చేసిన ఆయన నూతనంగా ఎన్నికైన సహకార సంఘ అధ్యక్షులతో ఆదివారం మధ్యాహ్నం సమీక్షించారు. జిల్లాలో అత్యధికంగా 67 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగుర వేయడం ఆనందంగా ఉందన్నారు.

ఇదే ఉత్సాహంతో ముందుకు సాగి డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను దక్కించుకోవాలని సూచించారు. ప్రత్యర్థులు కుట్రపూరిత విధానాలతో ఛైర్మన్ పదవిని దక్కించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సహకార సంఘాల ఎన్నికల ఫలితాలను ఆయన విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానంతో సభ్యుల చేర్పుల సమయంలోనే అక్రమాలకు పాల్పడిందన్నారు. దీని వల్ల కొన్ని స్థానాల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలైనట్లు గుర్తించామన్నారు. మరి కొన్ని చోట్ల నాయకులు గెలుస్తామన్న ధీమాతో, ఇంకొన్ని చోట్ల ఓటమి తప్పదని భావించి నిర్లక్ష్యంగా ఉండటంతో చేజారిపోయాయన్నారు. ఇలాంటి చోట్ల కష్టపడి పని చేసి ఉంటే గెలుపు సాధ్యమయ్యేదని చెప్పారు. ఎన్నికల తర్వాత అభ్యర్థులను కాపాడుకోవడంపై గత విషయాలను చంద్రబాబు సమావేశంలో వివరించారు.

* పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్ శస్త్రచికిత్స కోసం వెళ్లిన సమయంలో జరిగిన ఓ సంఘటనను ఉదహరించారు. అప్పట్లో ఎన్‌టీఆర్ పదవిని కాపాడేందుకు 163 మంది ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచి, నెల రోజుల పాటు క్యాంపు నిర్వహించి పార్టీని కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ రోజుల్లోనే ఇందిరాగాంధీ తనకు కేంద్ర మంత్రి పదవిని ఇస్తానని చెప్పినా లొంగకుండా పార్టీ కోసం నిలబడ్డానన్నారు.

* 1991లో చిత్తూరులో 19 మంది సహకార సంఘ ఛైర్మన్లను ఆరు నెలల పాటు క్యాంపులో ఉంచి అక్కడ ఛైర్మన్, ఉపాధ్యక్ష పదవితో పాటు అన్ని డైరెక్టర్ల స్థానాలను కైవశం చేసుకున్న సంగతిని వివరించారు.

పార్టీలో 98 శాతం మంది మంచి వారు ఉన్నారని, అయితే మిగిలిన ఇద్దరిని కాపాడుకునేందుకే ఇలాంటి క్యాంపులు అవసరమవుతున్నాయన్నారు. దీనిపై ఎవ్వరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చంద్రబాబు సూచించారు. అనంతరం నియోజకవర్గాల వారీగా ఫలితాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిలకలూరిపేట, పొన్నూరు, వినుకొండ, పెద్దకూరపాడులో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నందున ఆ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్యేలను, ఇన్‌ఛార్జ్‌లను అభినందించారు. ఫలితాల సాధనలో వెనకబడిన నియోజకవర్గ బాధ్యులకు సున్నితంగా చురకలంటించారు.

ఇలా అయితే కష్టమని, భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికైన సహకార సంఘ అధ్యక్షులు హాజరు కాకపోవడంపై బాబు నవ్వుతూనే చురకలేశారు. అంత అలసిపోయారా అంటూ ఇన్‌చార్జ్ నిమ్మకాయల రాజనారాయణను ప్రశ్నించారు. గత చరిత్రలో ఎల్లప్పుడూ సత్తెనపల్లి ఫలితం ఎకపక్షంగా వస్తున్న విషయాన్ని గుర్తించాలని నియోజకవర్గ బాధ్యునికి సూచించారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. తాడికొండ, మంగళగిరి, రేపల్లె, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం అయ్యేలా ఆయా నియోజకవర్గ బాధ్యులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, జీవీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రులు జె ఆర్ పుష్పరాజ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎంపీ లాల్‌జాన్ భాషా, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎం జియావుద్దీన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు చీరాల గోవర్థన్‌రెడ్డి, ముమ్మనేని వెంకట సుబ్బయ్య, అనగాని సత్యప్రసాద్‌గౌడ్, నిమ్మకాయల రాజనారాయణ, కందుకూరి వీరయ్య, చిరుమామిళ్ల మధుబాబు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజామాష్టారు, రాష్ట్ర కార్యదర్శి వెన్నా సాంబశివారెడ్డి, బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, యాగంటి దుర్గారావు, మల్లి, దామచర్ల శ్రీనివాస్, కోవెలమూడి రవీంద్ర, వాసిరెడ్డి జయరామయ్య, ఎన్‌వీవీఎస్ వరప్రసాద్, ఇక్కుర్తి సాంబశివరావు, పలు సహకార సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.