February 11, 2013

అభిమానులతో చంద్రబాబు

వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా గుంటూరు నగరంలోని సిద్దార్థ గార్డెన్స్‌లో బస చేసిన చంద్రబాబు ఆదివారం మధ్నాహ్నం నుండి సాయంత్రం వరకు అభిమానులతో గడిపారు. డాక్టర్ సలహా మేరకు ఆదివారం పాదయాత్ర నిలిపిన ఆయన మధ్నాహ్నం కొంత సేపు సహకార సంఘ అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ముందు, తరువాత అభిమానులతో ముచ్చటించారు. వారితో కలసి ఫొటోలు దిగారు.

అనేక మంది తెలుగు దేశం ద్వితియ శ్రేణి నాయకులు, విద్యార్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో గార్డెన్ వద్దకు చేరుకున్నారు. ఉదయం పది గంటల నుండి అక్కడ కార్యకర్తల, నాయకుల సందడి ప్రారంభమైంది. మధ్నాహ్నం సమయానికి జిల్లా నాయకులు, తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు చంద్రబాబు బస వద్దకు చేరుకున్నారు.

మధ్నాహ్నం ఒంటి గంట సమయంలో బస్సులో నుండి బయటకు వచ్చిన బాబు కార్యకర్తలతో, అభిమానులతో కలసి ఫొటోలు దిగారు. ఈ సమయంలో వారు ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించారు. పలు సమస్యలపై వారితో మాట్లాడారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు.

చంద్రబాబును కలసిన రాచకొండ లక్ష్మయ్య

సిద్దార్థ గార్డెన్స్‌లో బస చేసిన చంద్రబాబును ఆదివారం 103 బిసి కులాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు రాచకొండ లక్ష్మయ్య మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ బిసిలకు రానున్న ఎన్నికల్లో 100 సీట్లు కేటాయిస్తానన్న చంద్రబాబును మ ర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు జారీ చేసిన జీవో నెంబరు 802 అమలయ్యేలా చూడాలని కోరినట్లు తెలిపారు.