February 11, 2013

ఏ జన్మ సుకృతమో..!

జనాదరణతో అడుగు ముందుకు పడడం లేదు. గుంటూరు పట్టణంలో అడుగడుగునా ఆడపడుచులు చూపిన అభిమానం నన్ను ముందుకు కదలనీయలేదు. ఇది ఏ జన్మ సుకృతమో! ఇన్ని లక్షలమంది అభిమానానికి నోచుకుంటున్నా. నా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో ఏ ఒక్క ఆడపడుచు ఇళ్లల్లో లేరు. రోడ్డుకు ఇరువైపులా నా రాక కోసం బారులు తీరి కనిపించారు.

కష్టాల్లో ఉన్నవాళ్లకు అండగా నిలవడం కోసం నేను వచ్చాను. కానీ, నా రాక వాళ్లలో పండుగ వాతావరణాన్ని నింపింది. అడుగడుగునా పూలతో స్వాగతం పలుకుతున్నారు. సొంత అన్న కంటే మిన్నగా నన్ను ఆదరిస్తున్నారు. కొందరైతే, రోజుల బిడ్డలను చేతుల్లో పొదివి పట్టుకుని పేరు పెట్టాలంటూ నన్ను అడుగుతున్నారు. అందరి ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. కానీ, కళ్లల్లో మాత్రం దిగులు కదలాడుతోంది. కదిలిస్తే పాలకులపై భగ్గుమంటున్నారు.

శివనాగరాజు కాలనీలో కష్టాలు చెప్పాలని మైకు ఇవ్వగానే, మహిళలంతా ఈ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సర్టిఫికెట్లో పేరు మార్చుకోవడానికి ఎమ్మార్వో కార్యాలయానికి వెళితే రూ.5000 లంచం అడిగారని ఓ సోదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని ఉంటున్న తమను పట్టాలు లేవని బెదిరించి, స్థలాలు లాక్కుంటున్నారని మరో మహిళ ఆందోళన చెందింది. పింఛను కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నానని మరో అవ్వ కన్నీళ్లపర్యంతమైంది. బహిరంగ సభల్లో సైతం కష్టాల్లో ఉన్నవాళ్లు చేతులు ఎత్తండి అని కోరితే, అక్కడున్న వేల మంది ముక్తకంఠంతో తాము కష్టాల్లో ఉన్నామని చెబుతున్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఉంటే ముందు వాళ్ల గోడు వినాలి.