February 11, 2013

మహిళల కష్టాలకే ప్రాధాన్యం

ఏమ్మా... మీ ఇంటికి కరెంటు బిల్లు ఎంత వచ్చింది? రూ. వెయ్యి వచ్చి ఉంటుంది. ఒక బల్బు, ఫ్యానుకే అది కూడా రాని కరెంటుకు బిల్లు వస్తోంది. దానిపై సర్‌చార్జ్ వేస్తున్నారు. ఇప్పటికి మీ మీద రెండు కరెంటు బాంబులే పడ్డాయి. మరో పెద్ద బాంబు పడబోతోంది.

తల్లీ... వంట గ్యాస్ ధర ఎంతమ్మా? రూ. 475 కడుతున్నారు కదా? మరి కొద్ది రోజుల్లో రూ. 1175 కడితే ఆ తర్వాత ఎప్పటికో మీకు ఆధార్ అకౌంట్ ఉంటే అందులో వేస్తారంట. అది కూడా సంవత్సరానికి ఆరు సిలిండర్లే ఇస్తారు.

ఆరో సిలిండర్ దాటితే రూ. 1175 కట్టాలి. నేను తొమ్మిదేళ్ల పాటు రూ. 235 గ్యాస్ సిలిండర్ ధర పెరగకుండా చేశాను. మా ఎంపీలను గెలిపిస్తే గ్యాస్ ధర తగ్గించేలా చేస్తా.

బియ్యం ధర ఎంత? రూ. 50 అయింది కదా. ఉల్లిపాయలు మీరు తలుచుకొంటేనే వాటి ధర(రూ.40) కన్నీళ్లు తెప్పించేలా చేస్తోంది. నూనె రూ. 100 దాటింది. ఉప్పు రూ. 10కి చేరుకొన్నది. కందిపప్పు రూ. 80 అయ్యింది. మీ సంపాదనేమో రోజంతా కష్టపడినా రూ. 100 దాటడం లేదు. మీరు ఏమి తింటున్నారు... ఏమి కొంటున్నారు. నాడు జేబులో డబ్బులు తీసుకెళితే సంచి నిండా సరుకులు వచ్చేవి. నేడు సంచిలో డబ్బులు తీసుకెళితే జేబు నిండా సరుకులు రాని పరిస్థితి. మీరే ఆరోజుకు, నేటికి మధ్య తేడాని ఆలోచించుకోండి.

ఇలా టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు ప్రసంగిస్తూ మహిళలు స్పందించేలా చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు నాలుగు రోజుల పాటు జరిగిన పాదయాత్రలో చంద్రబాబు ఏ వీధికి వెళ్లినా మహిళలతో సంభాషించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు తాము పడుతోన్న కష్టాలను ఆయన వద్ద వ్యక్తపరుస్తున్నారు.

రూపాయికి కేజీ బియ్యం ఇచ్చి మిగతా ధరలు అన్ని పెంచారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యం కేజీ రూ. 44 పెట్టి కొనలేకపోతున్నామని, కరెంటు బిల్లులపై మహిళలు ఆవేశంగా స్పందిస్తున్నారు. సిలిండర్ మరో రూ. 50 పెంచుతారా ంట. ఇక మేము మ ళ్లీ కట్టెల పొయ్యిలు పెట్టుకొంటామని పేర్కొంటున్నారు.

చినకాకాని మొదలుకొని జిల్లా కేంద్రం వర కు చంద్రబాబు పాదయాత్ర సాగిన మార్గమంతటా మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా దళిత వాడల్లో చంద్రబా బు పాదయాత్రకు లభిస్తోన్న స్పందన తెలుగుదేశం పార్టీ నాయకులనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కచ్చితంగా మహిళలు నిత్యవసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు, వంట గ్యాస్ ధరపై ఓటు రూపంలో చూపిస్తారని నాయకులు విశ్వసిస్తున్నారు.

ఎక్కడికెళ్లినా ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు సంఘీభావం తెలుపుతున్నారు. చంద్రబాబు కూడా తన పాదయాత్రకు మహిళల నుంచి వస్తోన్న స్పందనపై తొలిసారిగా ఆదివారం పెదవి విప్పారు. పబ్లిక్ లో విపరీతమైన స్పందన కనిపిస్తోందని, ఎవ రూ సమీకరించకుండానే స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.