February 11, 2013

కష్టపడకుండా కుంటిసాకులు చెప్పొద్దు

వైసీపీ పీకేసేదే!
ఎక్కువ కాలం రాజకీయాల్లో మనలేదు
ఇన్‌చార్జీలకు బాబు చురక

  " సహకార ఎన్నికలకు ముందు ఏడుసార్లు మీతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడాను. ప్రతి చోటా పోటీ పెట్టాలని స్పష్టంగా చెప్పాను. ఓటరు చేర్పు లు మొదలుకొని పోలింగ్ తేదీ ముగిసేరోజు వరకు కష్టపడాలని సూచించాను. కానీ, మీరు 30 శాతమే కష్టపడ్డారు. అయినప్పటికీ మనకు, కాంగ్రెస్‌కు మధ్య సొసైటీ ఫలితాల్లో వ్యత్యాసం 10 శాతం మాత్రమే. గట్టిగా పని చేసి ఉంటే ఆప్కాబ్ పదవి కూడా మన దక్కే''దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు గుంటూరు జిల్లా పార్టీ నేతలకు క్లాస్ తీసుకొన్నారు. వైసీపీ పీకేసే పార్టీయే అనేది సహకార ఎన్నికల్లో తేలిపోయిం దంటూ శ్రేణులను ఉత్సాహపరిచారు.

ప్రతి ఆదివారం పాదయాత్రకు విరామం ప్రకటించాలని నిర్ణయించిన చంద్రబాబు.. మధ్యాహ్నం గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన సహకార సొసైటీల్లో గెలిచిన అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని 17 నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను ఆహ్వానించారు. ఎన్ని సొసైటీలు గెలిచారు..ఓటమికి కారణాలు తదితర వివరాలను నియోజకవర్గం వారీ సమీక్షించారు. ఇతర పార్టీల కంటే ఎక్కువ స్థానాలు సాధించిన ఇన్‌చార్జ్‌లను అభినందించారు. ఎక్కడైతే పార్టీ వెనకబడిపోయిందో సంబంధిత నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లకు మెత్తగా చురకలంటించారు.

" సహకార ఎన్నికల ఫలితాలు రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో నిలబడేది టీడీపీ, కాంగ్రెస్‌లే. వైసీపీ కొనసాగబోదని తేలిపోయింది.తెలంగాణలోనూ టీఆర్ఎస్ ఎక్కడా గెలవలేకపోయింది. మనవాళ్లు సీరియస్‌గా తీసుకొని ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బరి తెగించి అక్రమాలకు పాల్పడింది. టీడీపీ పటిష్ఠంగా ఉన్న చోట ఎన్నికలు జరపకుండా స్టే విధించింది. దీని వలన మనవాళ్లు కొంత డల్ అయ్యారు. నాయకులు బేషజాలు వీడి ఒకతాటి పైకి వచ్చి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, డీసీఎంఎస్‌లను కైవసం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు పుల్లారావు, మాజీ మంత్రులు కోడెల శివప్రసాదరావు, పుష్పరాజ్, ఆలపాటి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు.

సత్తెనపల్లి చరిత్ర తెలుసా?
"రాజనారాయణా! నీకు సత్తెనపల్లి చరిత్ర తెలుసా? కమ్యూనిస్టులు ఉన్నప్పటి నుంచి అక్కడ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయి. అక్కడ పార్టీ ఎందుకు వెనకబడిపోయింద''ంటూ సత్తెనపల్లి ఇన్‌చార్జీని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షులు సమీక్షకు ఎందు కు రాలేదని ప్రశ్నించారు.రాజకీయాలు నాకు చెప్పొద్దు

బాపట్ల నియోజకవర్గంలో 11 సొసైటీలకు గాను టీడీపీ నాలుగు మాత్రమే కైవసం చేసుకోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ గోవర్థన్‌రెడ్డిని వివరణ అడిగారు. నాలుగు స్థానాల్లో ఇండిపెండెంట్లకు మద్దతిచ్చామని ఆయన చెప్పడంతో.. "నాకు రాజకీయాలు వినిపించొద్ద''ని బాబు చురకేశారు