February 11, 2013

అవినీతి మంత్రులకు కొమ్ముకాస్తున్న కిరణ్

'నీట్' పరీక్ష రద్దుపై సీఎంకు లేఖ రాస్తా
రుణ మాఫీ చేసి చూపిస్తా : చంద్రబాబు నాయుడు

'నీట్' పరీక్ష రద్దుపై విద్యార్థులతో కలిసి పోరాడుతానని, దీనిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. భవిష్యత్తులో డిమాండ్ కోర్సులకు తగిన విధంగా విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తామని బాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లెదర్ పార్కులు ఏర్పాటు చేసి, 7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

'వస్తున్నా...మీకోసం' యాత్రను సోమవారం ఉదయం జిల్లాలోని సిద్దార్థ గార్డెన్స్ నుంచి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాస్పనదమైన 26 జీవోల విషయంలో అవినీతి మంత్రులకు ముఖ్యమంత్రి అండగా ఉంటూ కాపాడుతున్నారని, కాంగ్రెసు పార్టీ నేతలు దోచుకోవడంలో ఇప్పుడు బిజీగా ఉన్నారన్నారని, కాంగ్రెసు నేతల కబంద హస్తాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ముతో పెట్టిన 'సాక్షి' పత్రిక, తనపై, టీడీపీపై కక్ష కట్టిందని, సాక్షి దిన పత్రికను ఎవరూ చదువవద్దని చంద్రబాబు నాయుడు సోమవారం పిలుపునిచ్చారు. దివంగత వైయస్ తన తనయుడు జగన్మోహన్ రెడ్డికి లక్ష కోట్లు దోచిపెట్టారని మండిపడ్డారు. రాష్ట్రం తరఫున పది మంది కేంద్రమంత్రులు ఉన్నా నిధులు తీసుకు రావడంలో విఫలమవుతున్నారని బాబు ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వస్తే రుణ మాఫీ చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు పార్టీ అతలాకుతలం చేసిందని దుయ్యబట్టారు.

కాంగ్రెసు కబ్జాల పార్టీ అని, కరెంట్ రాదు కానీ, నడ్డివిరిచేలా బిల్లులు మాత్రం వస్తాయని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. టిడిపి హయాంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామన్నారు. టిడిపి హయాంలో అభివృద్ధితో పాటు ఆదాయం పెరిగిందని చెప్పారు. పెరిగిన ఆదాయం కాంగ్రెసు నేతల జేబుల్లోకి వెళ్తోందన్నారు. మనదేం పోయిందని ఎవరూ అనుకోవద్దని, పోయింది ప్రజల సొమ్మే అన్నారు. మహిళలకు సమాన హక్కుల కోసం ఎన్టీఆర్ ఆనాడే చట్టాలు తీసుకువచ్చారని, మహిళలు హక్కుల కోసం పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.