February 18, 2013

రైతు 'రుణం' తీర్చుకుంటా!

ఖరీఫ్‌లో వానలు లేవు. కాలువల కింద నీళ్లు విడుదల చేయలేదు. రబీలో ఏంతో కష్టపడి పండిస్తే... అకాల వర్షాలతో నష్టాలు. ఎక్కడ చూసినా రైతులకు ఇలాంటి ఇబ్బందులే. అలాంటి రైతులను రుణ మాఫీతో ఆదుకుంటే నేరమా? లేక... ఘోరమా? రైతులంతా ఆనందంగా ఉన్నారా? వారికి రుణ మాఫీ అక్కర్లేదా? ఈ విషయాన్ని నేరుగా రైతులనే అడగాలని అనుకున్నాను. కూచిపూడిలో నా యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి మార్గమధ్యంలో పొలాల్లో రైతులతో మాట్లాడాను. ఇదే విషయంపై చర్చించాను. కష్టాల్లో ఉన్న తమకు నేను చేసిన రుణ మాఫీ ప్రకటన ఎంతో ఊరట నిచ్చిందని, భవిష్యత్తు పట్ల ఆశలు ఏర్పడ్డాయని... రుణమాఫీ వద్దనడంకంటే అన్యాయం మరొకటి ఉండదని వారు తెలిపారు.

మరి... రైతు ఘోష ముఖ్యమంత్రికి ఎందుకు వినపడటం లేదు? రుణ మాఫీ చేస్తానని మూల్పూరు, పోటుమర్రు సభల్లో నేను పునరుద్ఘాటించాను. ఆ సమయంలో గ్రామీణుల ముఖంలో చెప్పలేనంత ఆనందం కనిపించింది. వారి ముఖాల్లో కనిపించిన వెలుగుల సాక్షిగా చెబుతున్నాను... రుణ మాఫీ చేసి తీరుతాను. బెల్టు షాపుల రద్దుపై మలి సంతకం చేస్తానని మూల్పూరు సభలో చెప్పగానే అక్కడున్న ఆడపడుచుల నుంచి ఎంతో హర్షం వ్యక్తమైంది. అది వారి జీవితానికి పెద్ద ఊరటలా కనిపించింది.

ఇక... పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నాను. అవి పేద, దిగువ మధ్య తరగతి వర్గాల పిల్లలు చదువుకునే బడులు. కానీ, ఏ బడిలో చూసినా దుర్గంధమే. బడి ఆవరణలో పందులు కాపురం చేస్తున్నాయి. అక్కడ చదువుకునే పేద బిడ్డల ఆరోగ్యానికి ఎవరిది హామీ! ఈ పరిస్థితిని మార్చేదెప్పుడు? తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నాను. ప్రతి గ్రామంలో దాతలు విరాళాలు ఇస్తున్నారు. అభిమానంతో వారు పది రూపాయలు ఇచ్చినా, అది పది వేలతో సమానమే. ఇలాంటి అభిమానులే పార్టీకి కొండంత అండ!