February 18, 2013

పల్లెలెట్ల కదులుతున్నయంటే


సంక్రాంతి పండగను తలపించే రీతిలో పల్లెలు కళకళలాడుతోన్నాయి. పచ్చటి తోరణాలు, అరటి చెట్లతో స్వాగత ద్వారాలతో వీధులన్నీ కొత్త శోభను సంతరించుకొంటున్నాయి. కనక తప్పెట్లు, బ్యాండుబాజాలు, సంప్రదాయ నృత్యాలతో సందడిసందడిగా మారుతోన్నాయి. చంద్రబాబు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర సాగుతోన్న ప్రతి పల్లెలో ఉత్సవ శోభ ప్రతిబింబిస్తోంది. ఇంటిల్లిపాది రోడ్డు మీదకు వచ్చి అలుపెరగని బాటసారికి స్వాగతం పలుకుతున్నారు.

చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో 11వ రోజు పచ్చగా కళకళలాడే డెల్టా ప్రాంతంలోని పల్లెల నుంచి కొనసాగింది. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన నేతలు, తెనాలిలోని వస్త్ర వ్యాపారులు, ముస్లిం మైనార్టీలు, లాయర్లతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకొన్న చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం 1.10 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ఆయనకు చినరావూరులో ఘనస్వాగతం లభించింది.

పాటిబండ్ల నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఆయన మిత్రబృందం చంద్రబాబును సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో స్వాగతించింది. అక్కడ పది నిమిషాల సేపు ఓపెన్‌టాప్ వాహనంపై చంద్రబాబు ప్రసంగించారు. పక్కనే ఉన్న వీజీటీఎం ఉడా పార్కును చూసి దానిని తామే అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ వాళ్లు వచ్చి ్రపైవేటీకరణ చేసి కంపు కొట్టే స్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కష్టాలు చూడటానికే నేను వచ్చాను. ఇక్కడ తాగేందుకు నీళ్లు లేవు. ముస్లింల స్మశానవాటికకు రోడ్డు లేదు. ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నారు. మీరు ప్రజల్లో చైతన్యం నింపే బాధ్యత తీసుకోండి.. తాను మీ జీవితాలు బాగు చేసే బాధ్యత చూసుకొంటానని హామీ ఇచ్చి ముందుకు కదిలారు.

రేపల్లె రైల్వేగేటు మీదుగా జంగడిగుంటపాలెం, ప్రగతీ నగర్, బీసీ కాలనీ, పెదరావూరు మీదుగా కూచిపూడి వరకు యాత్ర కొనసాగింది. మధ్యాహ్న భోజన సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమై త్వరలో జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అవలంభించాల్సిన వైఖరిపై చర్చించారు. అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణం, నింగినంటిన నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్ సిలిండర్ కష్టాలు, అకాలవర్షంతో రైతులకు కలిగిన నష్టం, కరెంటు కష్టాలపై గళం విప్పాలని సూచించారు. రైల్వేబడ్జెట్‌లో ర్రాష్టానికి జరుగుతోన్న అన్యాయాన్ని నిలదీయాలని సూచించారు.

చంద్రబాబు రూట్‌మ్యాప్‌లో కొన్ని కాలనీలు లేకపోయినా ఆయా ప్రాంతాల ప్రజలు వచ్చి రోడ్డుకు అడ్డంగా నిలబడి తమ వీధులకు తీసుకెళుతున్నారు. తాము పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంటింటి నుంచి మహిళలు రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబుకు హారతి ఇస్తూ నుదుటిన కుంకుమ దిద్దుతూ దీవిస్తున్నారు. కలెక్టర్‌కు నాలుగు లేఖలు

* తెనాలి మండలం గుడివాడ గ్రామంలోని అంతర్గత రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తక్షణం ఆ గ్రామంలో రోడ్లు, మురుగుకాలువలు నిర్మించాలని చంద్రబాబు కోరారు.

* అంగలకుదురు గ్రామంలో రోడ్ల మధ్యన నీటిగుంటల్లో దోమలు చేరి ప్రజలు అంటువ్యాధుల భారిన పడుతున్నారని చెబుతూ ఆ గ్రామంలో రోడ్లు, ్రడైనేజీ వ్యవస్థను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. * కొలకలూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా ఇప్పటివరకు బిల్లుల చెల్లింపు జరగలేదు. లబ్ధిదారులు అప్పులు తెచ్చి పనులు మొదలుపెట్టి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. తక్షణం ఇళ్లకు బిల్లులు మంజూరు చేయాలన్నారు.* అంగలకుదురు గ్రామంలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు రావడం లేదు. తక్షణం అక్కడ సర్వే చేపట్టి పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.

ప్రకాశం జిల్లా ఉద్యోగి స్ఫూర్తి చంద్రబాబు చేస్తోన్న పాదయాత్రకు ప్రకాశం జిల్లాకు చెందిన ఉద్యోగి త్రివిక్రమరావు స్ఫూర్తి పొందారు. ఆయన తన నెల జీతం రూ. 78,837ను పెదరావూరు వద్ద చంద్రబాబుకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే విరాళాలతోనే తెలుగుదేశం పార్టీ నడుస్తోందని, ఏ సందర్భంలోనూ ప్రభుత్వంపై ఆధారపడలేదని స్పష్టం చేశారు.

చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాదు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబు, టీడీపీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, నిమ్మకాయల రాజనారాయణ, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, తెలుగు యువత మల్లి, మానుకొండ శివప్రసాద్, కొర్రపాటి నాగేశ్వరరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు, ములకా సత్యవాణి, పానకాల వెంకటమహాలక్ష్మి తదితరులు నడిచారు.