February 18, 2013

జైల్లో ఉన్న వారిని నమ్మవద్దు : చంద్రబాబు

అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు
ప్రపంచంలో ఎక్కడ అవినీతి జరిగినా,
దివంగత వైఎస్ కుటుంబానికి లంకె

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రజా సమస్యలు పట్టడంలేదని, ఢిల్లీలో పైరవీలు చేయడంపైనే దృష్టి పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. పంట నష్ట పరిహారం విడుదలలో సీఎం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు సోమవారం కూచిపూడి నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలం తుపాన్ నష్టం నివేదికను కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటివరకు కేంద్రానికి పంపలేదని ఆయన దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రపంచంలో ఎక్కడ అవినీతి జరిగినా దివంగత వైఎస్ కుటుంబానికి లంకె ఉంటుందని, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ షెడ్యూల్ కులాల భూములను లాక్కున్నారని ఆరోపించారు. తాను ముప్పయ్యేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎంతో మందిని ముఖ్యమంత్రులను చూశానని కానీ, వైయస్‌లా దోచుకున్న వారిని చూడలేదన్నారు. జైల్లో ఉన్న వారిని నమ్మొద్దని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చే పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ నేతలు ఇంట్లో కూర్చుని సభ్యులను చేర్చుకున్నారని అందుకే, ఆ పార్టీ గెలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసు చిత్తు కావడం ఖాయమన్నారు. టిడిపి హయాంలో వంట గ్యాస్, స్టవ్ ఉచితంగా ఇస్తే, కాంగ్రెసు తన హయాంలో ఇచ్చిన గ్యాస్ కనెక్షన్‌లను రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు హయాంలో చనిపోయిన వారికి కూడా పింఛన్లు ఇస్తున్నారని, పింఛన్లలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయన్నారు.

వర్షం కారణంగా మహాధర్నా వాయిదా
గుంటూరు జిల్లాలో చంద్రబాబు సోమవారం తలపెట్టిన మహా ధర్నా వర్షం కారణంగా వాయిదా వేయడం జరిగిందని టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. నిన్నటి వరకు సాగునీరు లేక రైతులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారన్నారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో గుంటూరు జిల్లాలోకి చంద్రబాబు అడుగుపెట్టగానే రైతులు ప్రభుత్వం పట్ల ఆక్రోషాన్ని, ఆవేదనను చంద్రబాబు ముందు ఉంచారన్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి కూచిపూడిలో ధర్నా కార్యక్రమానికి టీడిపీ శ్రేణులు సమాయత్తమయ్యామని తెలిపారు. అకాల వర్షం కారణంగా కల్లాల్లో ఉన్న మిర్చి, అరటి, మొక్కజొన్న తోటలు, పండ్లతోటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టానికి సంబందించిన అంచనాలు తయారు చేసి తక్షణమే ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే తిరిగి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామన్నారు. తక్షణమే నష్టపరిహారం అంచనా వేసి ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.