February 18, 2013

వైఎస్ దోపిడీని కిరణ్ కొనసాగిస్తున్నాడు

జగన్ ఉన్మాది
న్యాయమూర్తులపైనా విషపు రాతలు
అన్ని కుంభకోణాల్లోనూ వైఎస్ కుటుంబం పేర్లు
అవినీతి డబ్బుతో చర్చిలు కడితే ప్రభువు క్షమించడు
మద్యం ధర పెంచితే సీఎంకు డబ్బులు కిక్
కాంగ్రెస్, వైసీపీ.. మదమెక్కిన పార్టీలు
గుంటూరు జిల్లా పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు

జగన్ ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దుయ్యబట్టారు. తనకు బెయిల్ ఇవ్వడం లేదని చివరికి న్యాయమూర్తుల పైనా విషపు రాతలు రాస్తున్నారని, తనకు వ్యతిరేకంగా ఉంటున్న పత్రికలపైనా ఆ పరంపరను కొనసాగిస్తున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కూచిపూడి గ్రామం నుంచి 'వస్తున్నా మీకోసం' పాదయాత్రను సోమవారం కొనసాగించిన చంద్రబాబు.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పైనా, వైఎస్ కుటుంబంపైనా నిప్పులు చెరిగారు. దేశంలో ఏ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చినా దాని మూలాలు రాష్ట్రంలో అందునా వైఎస్ కుటుంబంతో ముడిపడి ఉంటున్నాయని మండిపడ్డారు.

"వైఎస్ అల్లుడు అనిల్ మతాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు, భూములు దోచేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఎస్సీలకు చెందిన కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారు. అగస్టా హెలికాప్ట్టర్ల కుంభకోణంలోనూ అనిల్ పాత్ర ఉంది'' అంటూ నిప్పులు చెరిగారు. మూల్పురులోని ఎస్సీ కాలనీలో చర్చి నిర్మాణానికి ఎవరు డబ్బు ఇస్తారో వారికే తాము ఓటు వేస్తామని కొంతమంది మహిళలు చంద్రబాబుకు చెప్పగా.. జగన్ ఇచ్చే అవినీతి డబ్బుతో చర్చి నిర్మిస్తే ఏసుప్రభువు కూడా క్షమించరని వారికి చెప్పారు. దళిత ్రకైస్తవులను ఎస్సీల్లోకి చేర్పిస్తానని.. మాదిగలకు వర్గీకరణ అమలు చేసి పెద్దమాదిగను అనిపించుకొంటానని వాగ్దానం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపైనా బాబు తీవ్ర ఆరోపణలు చేశారు.

"మద్యం అమ్మకాల్లో కిరణ్‌కు కమీషన్లు ముడుతున్నాయి. ధర పెంచినప్పుడల్లా ఆయనకు డబ్బుల కిక్ ఎక్కుతూ స్వంత ఖజానా నిండిపోతోంది'' అని మండిపడ్డారు. నాడు వైఎస్ బరితెగించి దోపిడీకి తెర లేపితే దానిని కిరణ్ కొనసాగిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. "రాష్ట్రంలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. కేంద్రంలో కూడా టీడీపీ బలపరిచిన ప్రభుత్వమే ఏర్పడుతుంది. అప్పుడు రైతుల రుణమాఫీ అమలు చేసి చూపిస్తాం'' అని పునరుద్ఘాటించారు. సహకార ఎన్నికల్లో ఓటుకు రూ. 20 వేలు పంచి గెలిచి గొప్పలు చెప్పుకోవడం కాదని, ఏ ఎన్నికలు వచ్చినా తల్లి, పిల్ల కాంగ్రెస్‌లను చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సూట్‌కేసుల రాజకీయం నడుస్తోందని బాబు ఆరోపించారు.

జగన్ రూ.10 కోట్ల చొప్పున ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దోపిడీకి కారణం సోనియాగాంధీ అని విమర్శించారు. ఆ రోజున వైఎస్‌ను హెచ్చరించి ఉంటే రూ.లక్ష కోట్ల దోపిడీ జరిగేది కాదని, ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్వచ్ఛమైన, సమర్థవంతమైన, నీతిమంతమైన సుస్థిర పాలనను అందిస్తుందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ హయాంలో ప్రకృతివిపత్తుల వల్ల రూ.9.5 లక్షల కోట్ల నష్టం జరిగితే కేంద్రం నుంచి కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే తీసుకురాగలిగారని విమర్శించారు. "కాంగ్రెస్, వైసీపీ మదమెక్కిన పార్టీలు. రైతుల నడ్డి విరవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి'' అని ధ్వజమెత్తారు. కాగా, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అశోక్‌గజపతిరాజు సోమవారం చంద్రబాబును పాదయాత్రలో కలుసుకొన్నారు.

ప్రజా సహకారం లేకే అన్నా చతికిలబడ్డారు: అవినీతిపై పోరులో హజా రే ప్రజల సహకారం లేకే చతికిలబడ్డారని చంద్రబాబు అన్నారు. ప్రజలు తనతో కలిసిరావాలని అవినీతిని అంతమొందిద్దామని పిలుపునిచ్చారు.

అందరికీ చానెళ్లు.. వాటిలో వాళ్ల బొమ్మలే: రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉండటంపై చంద్రబాబు మండిపడ్డారు. "సీఎంకు ఒక టీవీ, పీసీసీ అధ్యక్షుడికి మరో టీవీ, వైఎస్ అల్లుడు అనిల్‌కు ఒక టీవీ, జగన్‌కు టీవీ, పత్రిక ఉన్నాయి. వాటిల్లో వాళ్ల బొమ్మలే చూపించుకొంటున్నారు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పాలించినా టీడీపీ పత్రిక, టీవీ పెట్టలేదని.. అదే తమ పార్టీ నిజాయితీ అని ప్రజలకు వివరించారు.